మహారాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఎకనాథ్ షిండే సర్కార్‌లో కొలువుతీరడం సంచలనం కలిగించింది. ఇక అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ముగ్గురు నేతలను ఎన్సీపీ పార్టీ నుంచి బహిష్కరించింది.
మహారాష్ట్ర రాజకీయాలు కాక రేపుతుండగా బిహార్, ఉత్తర ప్రదేశ్ లోనూ ఈ పరిస్ధితి తలెత్తే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవలే సంచలన ప్రకటన చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీతో చేతులు కలపడం పట్ల పలువురు ఎమ్మెల్యేల్లో అసమ్మతి రాజుకుందని ఆయన తెలిపారు.
యూపీ విషయానికి వస్తే పాట్నాన విపక్ష భేటీకి ఆర్ఎల్డి నేత జయంత్ చౌదరి గైర్హాజరుతో ఆయన ఎన్డీఏలో చేరవచ్చని పేర్కొన్నారు. మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవలే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇక మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం మలుపు తిరుగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన తొమ్మిది మందిపై అనర్హత వేటు వేసేందుకు ఎన్సీపీ సన్నద్ధమైంది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఇప్పటికే శరద్ పవార్ శిబిరం తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసింది.
రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్‌ను కూడా ఆ పార్టీ ఆశ్రయించింది. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పార్టీ అధినేత శరద్ పవార్ వెన్నంటి ఉన్నారని ఎన్సీపీ పేర్కొంది. రెబెల్ ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టాలని కోరుతూ శరద్ పవార్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను పరిశీలిస్తున్నామని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వెకర్ తెలిపారు.