అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఆగస్టు 14న మరోసారి విచారించనుంది. అయితే, అప్పటిలోగా దర్యాప్తునకు సంబంధించిన నివేదికను కోర్టులో దాఖలు చేయాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సెబీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ‘దర్యాప్తు పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని మెహతా పేర్కొన్నారు.
నిపుణుల కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందని, దీనిపై సమాధానం దాఖలు చేశామని, ఆరోపణలతో సంబంధం లేదన్నారు. సెబీ సమాధానం తమకు పేర్కొంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట జాబితా చేసిన మరికొన్ని పిటిషన్లపై విచారణ ముగిసిన వెంటనే ఈ అంశాన్ని విచారణకు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
2019 నిబంధనల మార్పుతో విదేశీ నిధుల లబ్ధిదారులను గుర్తించడం కష్టం కాదని, ఏదైనా ఉల్లంఘన జరిగినట్లు తేలితే.. లేదా రుజువైతే చర్యలు తీసుకుంటామని సెబీ సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొంది. ఈ వ్యవహారంలో మరోసారి సుప్రీంకోర్టులో ఆగస్టు 14న విచారణ జరుగనున్నది.
అదానీ గ్రూప్ పన్ను రహిత దేశాల్లో నెలకొల్పిన డొల్ల కంపెనీల ద్వారా పెట్టుబడుల్ని తరలించి, ఆ గ్రూప్ షేర్లను కృత్రిమంగా పెంచుకున్నదంటూ హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అదానీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ వ్యవహారంలో విచారణ జరుపాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నది.