సుమారు ఐదేళ్ల తర్వాత ఈ 18న ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సమావేశంకు మొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అదే విధంగా లోక్ జన్‌శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ను కూడా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానించారు. ఈ విషయాన్ని నడ్డా ఒక ట్వీట్లో తెలియజేశారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు కున్న తర్వాత మొదటిసారిగా ఎన్డీయే సమావేశం జరుపుతున్నారు.
కేంద్రంలోని బీజేపీతో ఎల్జేపీకి (రామ్ విలాస్) పొత్తు ఉంది. 2021లో చీలిక తలెత్తడంతో ఎల్జేపీ (రామ్ విలాస్)కు ఎన్నికల సంఘం కొత్త గుర్తు కేటాయించింది. కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరస్ నాయకత్వంలోని ప్రత్యర్థి ఎల్జేపీ వర్గం రాష్ట్రీయ లోక్ జన్‌శక్తి పార్టీగా కొనసాగుతోంది. ఎల్జేపీ (రామ్‌విలాస్)కు లోక్‌సభలో ఒక సీటు ఉంది.
ఎన్డీఏ సమావేశానికి బీజేపీ ఆహ్వానంపై ఎల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాక్ స్పందిస్తూ ఎన్డీఏ సమావేశానికి హాజరుకావడం, లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమితో పొత్తు విషయంపై పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా వివిధ అంశాలపై తాము బీజేపీకి మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పాత మిత్రులను కలుపుకొని వెళ్లే ప్రయత్నంలో బీజేపీ పావులు కదుపుతోంది. అయితే జాతీయ మీడియాలో కధనాలు వచ్చినమేరకు ఈ భేటీకి టిడిపిని ఆహ్వానించడం లేదు. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ ను మాత్రం ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. సుదీర్ఘకాలం ఎన్డీయే భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ రైతు చట్టాలకు నిరసనగా ఎన్డీయే నుండి వైదొలగింది.
మహారాష్ట్రలో శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవర్)లతో పాటు పలు తమిళ్ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ మీడియా కధనాలు పేర్కొన్నట్లు కర్ణాటకలోని జేడీఎస్ ను ఆహ్వానించడం లేదు.
