2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో రెండు ప్రధాన కూటమిలుగా రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేను విస్తరించి, 38 పార్టీలలో నూతన ఉత్తేజం కలిగించే ప్రయత్నం ఒక వంక జరుగుతూ ఉండగా, బీజేపీయేతర ప్రతిపక్షాలు కాంగ్రెస్ చొరవతో `ఇండియా’ పేరుతో ఓ కూటమిగా ఏర్పడి బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించాయి.
ఈ రెండు కూటమిలలో కలిసి 65 పార్టీలు ఉన్నాయి. అయితే, వాటిల్లో సగంకు పైగా పార్టీలకు ప్రస్తుతం ఒక ఎంపీ కూడా లేరు. మరో 15కు పైగా పార్టీలకు ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు. ఇలా ఉండగా, పార్లమెంట్ లో 91 మంది సభ్యులను కలిగిన మరో 11 పార్టీలు మాత్రం ప్రస్తుతానికి ఈ రెండింటిలో ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా నిలిచాయి.
ఇందులో ప్రధానంగా మూడు పార్టీలు తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో అధికారంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 63 ఉన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, మరో 25 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరుతో జట్టుకట్టాయి.
తృణమూల్, జేడీయూ, ఎన్సీపీ, ఆప్, ఆర్జేడీ, సమాజ్‌వాదీపార్టీ, శివసేన (యూబీటీ) తదితర పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. మరోవైపు అధికార ఎన్డీఏ కూటమిలో 39 పార్టీలు ఉన్నాయి. అధికార, విపక్ష కూటమిలో భాగం కాని పార్టీలు: బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీ, బీఎస్పీ, ఏఐఎంఐఎం, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, ఏఐడీయూఎఫ్, జేడీఎస్, ఆర్ఎల్పీ, ఎస్ఏడీ(మన్).
ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు సమ దూరం పాటిస్తున్నది. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కోసం పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ, తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అవుతుందని ఆయన చెప్పారు.
ఏపీలో గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన వైఎస్సార్ సీపీ, ఒడిశాలో 2000 నుంచి అధికారంలో ఉన్న బీజేడీ పార్లమెంట్లో అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. లోక్‌సభలో 9 మంది సభ్యులను కలిగిన బీఎస్పీ కూడా ఏ కూటమిలోనూ చేరలేదు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం కూడా విపక్షకూటమిలో చేరలేదు. దానితో రెండు ప్రధాన కూటమిలకు వచ్చే ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఈ 11 పక్షాలు నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం వస్తుంది.
