కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ గృహాలను పరిశీలించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తలపెట్టిన `చలో బాట సింగారం’ కార్యక్రమాన్ని గురువారం పోలీసులు భగ్నం చేశారు. ఉదయం నుండే బీజేపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తూ, అరెస్టులు కూడా చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి వస్తున్న కిషన్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయం వద్దనే అడ్డుకున్నారు. దానితో ఆయన వర్షంలోనే రోడ్డుపై భైఠాయించి నిరసనకు దిగారు. బీఆర్ఎస్పై యుద్ధం మొదలైందని అంటూ బీఆర్ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఆపై అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు.
అనంతరం అక్కడ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు పడక గదుల ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా తనకు లేదా? అని ప్రశ్నించారు. ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్లో కూర్చొని అణిచివేస్తారా? అని దుయ్యబట్టారు.
‘‘ తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. రెండు పడక గదుల ఇళ్లూ వారికి ఇవ్వడం లేదు. బిఆర్ఎస్ పై మా ఉద్యమం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. బాటసింగారంలో మధ్యలోనే వదిలేసిన ఇళ్లను చూద్దామని బయలుదేరాం” అని తెలిపారు.
“శంషాబాద్ విమానాశ్రయం వద్ద నన్ను అడ్డుకున్నారు. పలువురు నేతలనూ అరెస్ట్ చేశారు. ఇవాళ ధర్నా, ఆందోళన కాదని చెప్పినా.. పోలీసులు మా పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. బడుగు బలహీనవర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలుసుకోవడానికి వెళ్తే ఇలా వ్యవహరిస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీల్లో సీఎం కేసీఆర్ ఏ ఒక్కటీ అమలు చేయలేదని చెబుతూ ప్రజల ఆవేదన, ఆక్రోశం బిజెపి నేతల అరెస్టులతో తగ్గదని హెచ్చరించారు. ప్రజల సమస్యల తరఫున ఈ యుద్ధం కొనసాగిస్తామని చెబుతూ తమ రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైందని, ఎన్నో సార్లు జైలుకు వెళ్లామని తెలిపారు.
తండ్రిని అడ్డం పెట్టుకొని తమకు పదవులు రాలేదని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇండ్లు కట్టాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 50 లక్షల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశా రు. బీఆర్ఎస్ ను గద్దెదించే వరకు పోరాటం చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించాయిరు. ఖరీదైన ఇళ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి కేసీఆర్ కు డబ్బులుంటాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి డబ్బులుండవని ప్రశ్నించారు.
