మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్ వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగి పడి భారీగా ప్రాణ నష్టం జరిగింది. వీరిలో 25 మంది మృతి చెందగా, 80 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కొండచరియల కింద ఎంతమంది ఉన్నారో సరిగ్గా తెలియడం లేదు. కొండచరియల కారణంగా కూలిన ఇళ్ల శిధిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే వారు బతికే అవకాశాలు తక్కువేనని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులను ఆయన దత్తత తీసుకోనున్నారని శివసేన పార్టీ వెల్లడించింది. రెండు నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్న చిన్నారులను శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ కింద ఆశ్రయం పొందుతారని చెప్పారు.
ముఖ్యమంత్రి కుమారుడు, కల్యాణ్ ఎంపీ డాక్టర్ శ్రీకాంత్ షిండే నడుపుతున్న శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ (ఎన్జీఓ) కింద ఈ చిన్నారులు ఆశ్రయం పొందుతారని, చదువు, వసతి సహా అన్ని ఖర్చులనూ పౌండేషన్ భరిస్తుందని తెలిపారు. ఏక్నాథ్ షిండే గతంలోనూ పలువురు పిల్లలను దత్తత తీసుకుని వారికి గార్డియన్‌గా ఉన్నారు.
2020లో హమద్లో తారిఖ్ గార్డెన్ భవంతి కూలిపోయినప్పుడు అనాథలైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. 2020 కూలీ పని చేసుకునే భార్యభార్తలు పాల్ఘార్ జిల్లాలో ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరి పిల్లల్ని కూడా షిండే దత్తత తీసుకున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన అనేక మంది పిల్లలు ఆశ్రమ్ స్కూలులో ఉన్నారని, వారంతా 2 నుంచి 15 ఏళ్ల వారేనని షిండే ఒక ట్వీట్లో తెలిపారు. దుఃఖంతో, భవిష్యత్ అగోమ్యగోచరంగా మారిన పిల్లలకు కష్ట సమయంలో ఎవరో ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని, వారికి ప్రేమను పంచాలని, వారిలో ఆత్మస్థైర్యం నింపాలని, అది సమాజంలో ఉంటున్న మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.