రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సహా సర్ కార్యవాహగా సేవలందించిన ప్రముఖ ఆర్ఎస్ఎస్ నేత మదన్ దాస్ దేవి సోమవారం తెల్లవారు జాము 5 గంటల ప్రాంతంలో బెంగళూరు ఆస్పత్రిలో మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన 81 ఏళ్ల వృద్ధ నేత సుదీర్ఘకాలంగా అస్వస్థతతో బెంగళూరు లోని రాష్ట్రోత్తన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం పుణెకు తరలించిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి. సోమవారం ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం బెంగళూరు లోని స్థానిక ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ కృపలో ఉంచారు. ఆర్ఎస్ఎస్ పూర్తి ప్రచారక్గా సేవలందించిన మదన్దాస్ దేవీ అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ఎబివిపి) సంఘటనా కార్యదర్శిగా 1967 నుండి 1990 వరకు పనిచేశారు.
దేశంలోనే బలీయమైన విద్యార్ధి ఉద్యమంగా తీర్చిదిద్దడంలో, దేశ వ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించారు. జాతీయ స్థాయి పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల్లో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంలో ఆయన ఎంతగానో దోహదపడ్డారు. దేశంలో పలు జాతీయ ఉద్యమాలలో విద్యార్థులు, యువతను సమీకరించడంలో విశేషంగా కృషి చేశారు.
ప్రధాని మోదీ సంతాపం
మదన్దాస్ దేవీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. “ఆయన తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారు. ఆయనతో నాకు అత్యంత సన్నిహితమే కాకుండా చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకునే అవకాశం కలిగింది. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు భగవంతుడు మనోనిబ్బరాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి ” అని తన సంతాప సందేశంలో నివాళి అర్పించారు.