మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించింది. వ్యూహాత్మకంగా ఈశాన్య రాష్ట్ర ఎంపీ గౌరవ్ గొగొయ్తో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇదే అంశంపై విపక్ష కూటమిలో లేని భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు.
ఈ నోటీసులను ఆమోదించినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతిస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష భేటీ తర్వాత తేదీని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని మోదీ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుందని, తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది.
ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేశాయి. అవిశ్వాస తీర్మానంపై 50 ఎంపీలు సంతకాలు చేశారు. అయితే, మొత్తం 543 మంది సభ్యులున్న లోక్సభలో ఎన్డీయ కూటమికి 330 మందికిపైగా సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఎంపీలు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే.
అయినప్పటికీ, కేవలం మణిపూర్ హింసపై చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐదేళ్ల కిందట 2018లో మోదీ ప్రభుత్వంపై ఇలాగే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి నిధుల విషయంలో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి యూపీఏ కూటమి మద్దతు తెలిపింది.
ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది. ఇప్పటి వరకూ స్వాతంత్ర భారత చరిత్రలో 27 సార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టగా కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వాలు కూలిపోయాయి. మొదటిసారి 1979లో మొరార్జీ దేశాయ్, తర్వాత 1999లో అటల్ బిహార్ వాజ్పేయ్లు ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అత్యధికంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధానిగా ఇందిరా గాంధీ రికార్డులకెక్కారు.
నిజమైన ప్రధాని మోదీ వాఖ్యలు
ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం గురించి 2019 లోక్సభ ఎన్నికల ముందు పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బయటికి వచ్చాయి. తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు.. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా దూరదర్శన్ న్యూస్ ట్విటర్లో పంచుకుంది.
ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల ముందే ఊహించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై నిర్వహించిన చర్చలో మోదీ ప్రసంగించారు. 2023 లో తమ ప్రభుత్వంపై అవిశ్వాసం తీసుకొచ్చేలా ప్రతిపక్షాలకు అవకాశం రావాలని.. అందుకు అన్ని పార్టీలు సిద్ధం కావాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
అవిశ్వాస తీర్మానంపై ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో ఉన్న అధికార పక్షానికి చెందిన ఎంపీలు నవ్వారు.
అంటే 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు దేశంలో ఓటమి తప్పదని, ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని ఎద్దేవా చేస్తూ ఆ సమయంలో ప్రధాని మోదీ ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాలుగేళ్ల తర్వాత సరిగ్గా అదే జరిగి, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.