హర్యానాలోని గురుగ్రామ్‌కు సమీపంలో విశ్వహిందు పరిషత్ (వీహెచ్‌పీ) చేపట్టిన ఊరేగింపుపై రాళ్ళ దాడి జరగడంతో తీవ్ర ఘర్షణలకు దారితీసింది. సోమవారం నుహ్ వద్ద వీహెచ్‌పీ చేపట్టిన ‘బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర’ నేపథ్యంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
పెద్ద సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. హింసాత్మఘటనల్లో ఇద్దరు హోంగార్డులు మృతి చెందారని, డీఎస్పీ సజ్జన్ సింగ్ తలకు గాయమైందని, ఓ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.పదిమంది పోలీసులతో సహా 20 మంది వరకు గాయాలకు గురయ్యారు.
గురుగ్రామ్-ఆల్వార్ జాతీయ రహదారిపై వీహెచ్‌పీ ఊరేగింపును కొంతమంది అడ్డుకోవటంతో హింస చెలరేగిందని తెలిపారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరు వర్గాల వారిని చెదరగొట్టేందుకు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్‌లు మొదట టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇంకా పరిస్థితిని అదుపులోకి తీసుకురాడానికి కాల్పులు జరిపారు.
కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం అప్రమత్తమై పారామిలిటరీ బలగాలను హుటాహుటిన రంగం లోకి దింపింది. బుధవారం వరకు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తూ హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఘర్షణలు చెలరేగటంతో యాత్రలో పాల్గొన్న 2500 మంది భయాందోళనతో సమీపంలోని నుల్హార్ మహదేవ్ ఆలయంలో తలదాచుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానాలోని గురుగ్రామ్, సివిల్ లైన్స్ నుంచి సోమవారం బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర ప్రారంభమైంది. బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు గార్గి కక్కర్, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రను నుహ్‌లోని ఖేద్లా మోడ్ వద్ద కొందరు దుండగులు అడ్డుకుని, రాళ్ల వర్షం కురిపించారు.
నుహ్‌లో ఘర్షణలు జరిగినట్లు తెలుసుకున్న వెంటనే సోహ్నాలో రెండు మతాలవారు ఘర్షణలకు దిగారు. రోడ్లను కొన్ని గంటలపాటు దిగ్బంధనం చేశారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. నుహ్‌లోని సైబర్ పోలీస్ స్టేషన్‌పై దుండగులు దాడి చేశారు. దుండగులు ఓ బస్సును లాక్కొని, పోలీస్ స్టేషన్ గోడను ఢీకొట్టి, గేటును పడగొట్టారు.
మూడు పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఇటీవల సైబర్ దొంగలపై పోలీసులు విరుచుకుపడినందుకు సైబర్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని, ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని పోలీసులు చెప్పారు. దాదాపు 1,000 మంది దుండగులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారని చెప్పారు.
పొరుగున గల జిల్లాల నుండి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు హర్యానా హోం మంత్రి అనీల్ విజ్ తెలిపారు. హెలికాప్టర్ ద్వారా బలగాలను పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రదర్శనలో పాల్గొన్న వాటిలో నాలుగు కార్లకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. కొన్ని పోలీసు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.
