నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ ఆగస్టు 8-,9, 10 తేదీలలో చర్చించనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానంపై శుక్రవారం మధ్యాహ్నం ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టింది. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం కోసం స్పీకర్‌కు నోటీసు అందచేశారు. 2018 తర్వాత పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాన్ని ప్రధాని మోదీ ఎదుర్కోవడం ఇది రెండవసారి.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీ గౌరవ్ గగోయ్ నోటీసుపై 50 మంది సభ్యులు సంతకం చేశారు. లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ బలం 331. విపక్ష కూటమి ఇండియా బలం 144 మంది. అయితే ఈ తీర్మానాన్ని విపక్షం నెగ్గడం కుదరదు. కానీ మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడే విధంగా చేస్తుందని విపక్షాలు భావిస్తున్నాయి.
జూలై 20వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రోజు ఉభయసభలు మణిపూర్ అంశం విషయంలో వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ తొమ్మిదో రోజు కూడా సభాకార్యక్రమాలు జరగలేదు.
మణిపూర్‌లో మే 3 నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సమస్యపై పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆయన ఈ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎంపీల బలం ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ఇచ్చిన నోటీసును స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు.