రాజధాని నగరం నిర్మాణం కోసం 33,000 వేల ఎకరాలను ఉచితంగా ఇచ్చిన రైతులను రోడ్లపైకి నెట్టివేసి, రాజధానిగా కొనసాగడానికి అక్కడేమి ఉన్నదని, ఎడారి, స్మశానం అంటూ మూడు రాజధానుల పల్లవి అందుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ చట్టాన్ని `సాంకేతిక కారణాలు’ పేరుతో వెనుకకు తీసుకున్నప్పటికీ, దాని వెనుక పెద్ద ఎత్తుగడ ఉన్నట్లు వెల్లడవుతున్నది.
కేవలం హైకోర్టులో ప్రతికూల తీర్పు రాకుండా ఉండడం కోసమే మూడు రాజధానుల అంశాన్ని వెనుకకు తీసుకున్నామని, తిరిగి త్వరలో పకడ్బందీగా చట్టం తీసుకు వస్తామని మంత్రులు, వైసీపీ నాయకులు చెబుతూనే ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా అమరావతిలో జరుగుతన్న నిర్మాణాలు, అభివృద్ధి పనులు అన్నింటిని నిలిపివేసి, రూపాయి కూడా ఖర్చు పెట్టని ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా అభివృద్ధి పనులు కొనసాగింపు పేరుతో నిధుల వేటకు బయలుదేరడం గమనార్హం.
అమరావతి భూములను అమ్మివేసి, సొమ్ము చేసుకునేందుకే ఈ ఎత్తుగడ అంతా అని స్పష్టం అవుతున్నది. అమరావతిలో ట్రంక్ ఇన్ఫ్రా, ఎల్పీఎస్ (భూసమీకరణ రైతులకు కేటాయించిన ప్లాట్లు) లేఔట్ల అభివృద్ధి పేరుతో అప్పులు తీసుకొస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.
దీనికోసం బ్యాంకుల నుంచి రూ.2995 కోట్లు రుణం సేకరిస్తామని నివేదికలో తెలిపింది. అలా తెచ్చిన అప్పును అమరావతిలో ఉన్న భూములను సంవత్సరానికి కొన్ని ఎకరాల చొప్పున అమ్మేసి తీరుస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయినవే.
ఇప్పుడు వాటిని అడ్డంపెట్టుకుని బ్యాంకుల ద్వారా రూ.2995 కోట్ల అప్పు తెచ్చి, పైపై మెరుగులు దిద్ది, మిగిలిన డబ్బులు ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోవాలని భావిస్తున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. రూ.2995 కోట్లు వడ్డీతో కలిపి బ్యాంకులకు తిరిగి చెల్లించే మార్గమేదీ లేదు.
‘‘ప్రతిఏటా అమరావతిలోని భూములను అమ్ముతాం. ఆ డబ్బులతో అప్పు చెల్లిస్తాం. వడ్డీ 7 శాతమైతే 481 ఎకరాలు, 8 శాతమైతే 504 ఎకరాలు అమ్ముతాం’’ అని నివేదికలో తెలిపారు. రుణం కాలపరిమితిని 18 సంవత్సరాలుగా పేర్కొన్నారు.
ఇందులో… రెండేళ్లు మారటోరియం. అంటే, మొదటి రెండేళ్లు అసలు, వడ్డీ కట్టక్కర్లేదు. మూడో సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు అసలు, వడ్డీ కట్టాలి. ఇందుకోసం ప్రతి సంవత్సరం అ మరావతిలోని కొన్ని ఎకరాల భూమి అమ్ముతూ ఉంటారు. కమర్షియల్ మానెటైజేషన్ కోసం అమరావతిలోని 5220 ఎకరాలు వాడుకుంటామని నివేదికలో పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్ర సంపదైన ప్రభుత్వ భూములను అమ్మేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. ‘మిషన్ బిల్డ్ ఏపీ’ పేరుతో భూములు అమ్మేందుకు జాబితా కూడా సిద్ధం చేసింది. ఈ దూకుడుకు కోర్టు బ్రేకులు వేసింది. నీతి ఆయోగ్ కూడా ఇలా అమ్మకం కుదరదని చెప్పింది.
దీంతో… సర్కారు రూటు మార్చింది. అప్పుల కోసం విశాఖలోని కలెక్టరు కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయాలు, ప్రభుత్వ కాలేజీలు, వందల ఎకరాల ప్రభుత్వ భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టింది. ఇప్పుడు జెన్కో, పవర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్లపైనా సర్కారు కన్ను పడింది. ఆ రెండు సంస్థలను అప్పుల్లోకి నెట్టి… పవర్ ప్లాంట్లను విక్రయించే పథకం రచించినట్లు తెలుస్తోంది.