విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని, వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చురకలంటించారు. బహుశా ఆ భగవంతుడే దిగొచ్చి ప్రతిపక్షాలకు అవిశ్వాసం పెట్టమని చెప్పి ఉంటాడంటూ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మూడు రోజులపాటు జరిగిన చర్చకు గురువారం సాయంత్రం ప్రధానమంత్రి జవాబు చెబుతూ విపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు అదృష్టమేనన్న ప్రధాని స్పష్టం చేశారు. తాము మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయని, అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం స్పీకర్ ఓం బిర్లా మూజువాణీ ఓటింగ్ నిర్వహించగా.. అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే లోక్‌సభలో విపక్షాలు వాకౌట్ చేయడంతో.. ఓటింగ్ లేకుండానే అవిశ్వాసం వీగిపోయింది.
ఈ సందర్భంగా 2018లో ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారని ఉద్ఘాటించారు. విపక్షాలు వరుసగా నోబాల్స్ వేస్తుంటే అధికార పక్షం ప్రతీసారి ఫోర్లు, సిక్సులు కొడుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ అన్ని రికార్డులు బద్దలుకొట్టి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
విపక్షాలకు పేదల గురించి ఆలోచన లేదని, అధికారంలోకి రావడమే వారి పరమావధి అని ధ్వజమెత్తారు. విపక్షాలు ఇన్నాళ్లూ దేశాన్ని నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప చేసిందేమీ లేదని దయ్యబట్టారు. 1999లో శరద్ పవార్ నాయత్వంలో, ఆ తర్వాత సోనియా నేతృథ్వంలో 2003, 2018లో అవిశ్వాసం పెట్టారని.. ఇన్నిసార్లు అవిశ్వాసాలతో వాళ్లు సాధించిందేంటి? అని ప్రశ్నించారు.
కార్మికులను విపక్షాలు రెచ్చగొట్టినా, నేడు హెచ్ ఏ ఎల్ విజయపథాన నడుస్తోందని, చరిత్రలో అత్యధిక ఆదాయం నమోదు చేసిందని ప్రధాని తెలిపారు. బ్యాంకులు మునిగిపోతున్నాయని, నాశనం అవుతున్నాయని శాపనార్ధాలు పెట్టారని, కానీ అందుకు భిన్నంగా బ్యాంకులన్నీ మరింత బలోపేతం అయ్యాయని పేర్కొన్నారు. కేవలం బలోపేతం కావడమే కాకుండా లాభాలబాట పట్టాయని చెప్పారు.
ఎల్ఐసి మునిగిపోతోందని, పేదల సొమ్ము కట్టబెడుతున్నారంటూ ప్రచారం చేశారని, స్టాక్ మార్కెట్లో దాని విలువ చూసి మాట్లాడండని హితవు పలికార. మోదీకి సమాధి తవ్వుతున్నారంటూ అపభ్రంశాలు పలుకుతున్నారని అంటూ అమంగళం, అపభ్రంశాలతో మోదీని ఎవ్వరూ ఆపరలేరని తేల్చి చెప్పారు. తాము ఏం చేయకుండానే భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందా? అని ప్రధాని నిలదీశారు.
ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన గానీ, స్థాయి గానీ కాంగ్రెస్‌కు లేదని ప్రధాని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ, దేశం పట్ల కాంగ్రెస్‌కు దిశదశ లేదని దయ్యబట్టారు. ప్రతి దాన్ని విమర్శించడం తప్ప ఆలోచనా విధానం లేదని చెప్పారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా సాధ్యం కాదని అన్నారని.. మేకిన్ ఇండియా అని చెప్పినప్పుడు కూడా ఎగతాళి చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్, దాని స్నేహితులకు భారత్ సామర్థ్యంపై నమ్మకం లేదని ప్రధాని స్పష్టం చేశారు. సరిహద్దుల్లోకి వచ్చి పాక్ కాల్పులు జరిపినప్పుడు నోరెళ్లబెట్టి చూశారని, పాక్ మాటలు నమ్మి, కశ్మీర్లో నిత్యం అశాంతి నెలకొనేలా చేశారని ఆరోపించారు. కశ్మీర్‌పై, కశ్మీర్ పౌరులపై కాంగ్రెస్‌కు విశ్వాసం లేదని కానీ.. తాము పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ప్రధాని గుర్తు చేశారు.
భారత్‌ను అప్రతిష్టపాలు చేయడం కాంగ్రెస్‌కు చాలా ఇష్టమని, భారత్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌పై వారికి నమ్మకం లేదని ప్రధాని మండిపడ్డారు. 2028లో మీరు అవిశ్వాసం తెచ్చేనాటికి.. భారత్ 3వ ఆర్థిక శక్తిగా నిలుస్తుందని మోదీ జోస్యం చెప్పారు. జనధన్ ఖాతాల గురించి తక్కువచేసి మాట్లాడారని, దానితో యూపీ, బిహార్, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌పై అన్నిరాష్ట్రాల ప్రజలు అవిశ్వాసం ప్రకటించారని చెబుతూ అహంకారంతో నిండిన కాంగ్రెస్‌కు నేల కనిపించడం లేదని ధ్వజమెత్తారు. 1991లో భారత్ అప్పుల కోసం ప్రపంచం వైపు చూసిందని, 2014 తర్వాత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుందని ప్రధాని చెప్పారు. తమ పనితీరు, నిబద్ధతతోనే దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి తీరుతామని ప్రధాని తేల్చి చెప్పారు.