భారత్ మరో చారిత్రక విజయాన్ని సాధించింది. చంద్రయాన్ -3 విజయవంతంగా చంద్రునిపై దిగింది. ఈ క్షణాల కోసం యావత్ ప్రపంచం ఊపిరిబిగపట్టుకుని ఎదురుచూశారు. 17 నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడిపై కాలుమోపింది.
అగ్రరాజ్యాలే చేతులెత్తేసిన చంద్రుని దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా జాబిల్లిపై దిగింది. సాయంత్రం 5.44 గంటల నుంచి ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అనంతరం సాయంత్రం 6.04 గంటలకు సేఫ్‌గా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది.
ఇస్రో.. ల్యాండింగ్ మాడ్యూల్‌కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ఏఎల్ఎస్) కమాండ్‌ను పంపింది. దీనిని అందుకున్న ల్యాండర్ మాడ్యూల్.. ఏఐ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. తన నాలుగు థ్రాటల్‌బుల్ ఇంజిన్లను మండించి తన వేగాన్ని తగ్గించుకుంది.
రఫ్ బ్రేకింగ్ దశను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (ఎల్పీడీసీ) , కేఏ బ్యాండ్ అండ్ లేజర్ బేస్డ్ ఆల్టీమీటర్ వంటి సాధనాలతో లక్ష్యాన్ని చేరుకుంది.
గంటల తరబడి ఉత్కంఠకు తెరదించుతూ మూన్ మిషన్ సక్సెస్ కావడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగితేలింది. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అనంతరం బెంగళూర్‌లోని మిషన్ కంట్రోల్ క్యాంపస్ వేదికగా శాస్త్రవేత్తల బృందాన్ని ఉద్దేశించి ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాధ్ మాట్లాడారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారత్ ఇప్పుడు చంద్రుడిపై కాలుమోపిందని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్ -3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు.
బ్రిక్స్ సమావేశాలకు హాజరయ్యేందుకు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రక ఘటాన్ని వర్చ్యువల్ గా చూస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయమని ప్రధాని కోనియాడారు.
“నేను బ్రిక్స్‌లో ఉన్నా.. నా మనసంతా చంద్రయాన్ మీదే ఉంది.. చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా 1000 మంది ఇస్రో సిబ్బందికి నా అభినందనలు.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశాం.. ఇది ఎంతో అద్భుతమైన క్షణం” అంటూ సంతోషం ప్రకటించారు.
“చంద్రయాన్ 3తో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది.. కళ్లముందు అద్భుతాన్ని చూశాము.. నా జీవితం ధన్యమైంది. అమృత కాలంలో తొలి ఘనవిజయం ఇది.. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం..” అంటూ ప్రధాని మోదీ బ్రిక్స్ నుంచి మాట్లాడారు.