భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2021 ఏడాదికి గాను 69వ జాతీయ పురస్కారాలను కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘పుష్పః ది రైజ్’ సినిమాలో నటనకుగానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలో ‘తగ్గేదేలే…’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్, చూపించిన మేనరిజమ్స్, ‘పుష్ప రాజ్’గా చేసిన నటన అతడిని జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. దీంతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సాధించలేకపోయిన జాతీయ అవార్డును టాలీవుడ్‌కు అల్లు అర్జున్ సాధించి పెట్టి చరిత్ర సృష్టించాడు.
ఇక ఉత్తమ సంగీతం (పాటలు) విభాగంలో కూడా ‘పుష్ప’ సినిమాకు గాను దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆస్కార్ అవార్డును అందుకున్న బిగ్గెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కూడా జాతీయ చలన చిత్ర అవార్డులలో తన సత్తా చాటింది.
జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆరు విభాగాల్లో పురస్కారాలను గెలుపొందడం విశేషం. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాల భైరవ, ఉత్తమ సంగీతం (నేపథ్య) కీరవాణి, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్‌గా కింగ్ సోలోమన్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో శ్రీనివాస్ మోహన్, అత్యంత ప్రజాదారణ పొందిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’కు అవార్డులు దక్కడం విశేషం.
ఉత్తమ తెలుగు సినిమాగా ‘ఉప్పెన’ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ గీత రచన విభాగంలో ‘కొండపొలం’ సినిమాకు గానూ చంద్రబోస్ జాతీయ అవార్డును గెలుపొందారు.
ఇక ఉత్తమ నటిగా అలియా భట్ (గంగూబాయి కతియావాడి), కృతిసనన్ (మిమీ), ఉత్తమ చిత్రంగా రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ), ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ (గోదావరి –మరాఠీ), ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ), ఉత్తమ సహాయ నటుడిగా పంకజ్ త్రిపాఠి (మిమి–హిందీ) జాతీయ అవార్డులను గెలుపొందారు.
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ‘జాతీయ పురస్కారాలు’ అందుకున్న వారందరికీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వించదగిన రోజు అని.. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు-2021 సొంతం చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం గెలిచిన అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
బన్నీ ఉత్తమ నటుడిగా అవార్డ్ సొంతం చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉందని థెయ్ల్పారు. ఇక ఆర్ఆర్ఆర్ (6), ఉప్పెన (1- ఉత్తమ తెలుగు చిత్రం), పుష్ప (2), కొండపొలం (1) పురస్కారాలు పొందడంతో.. ప్రతి ఒక్కరికీ పేరుపేరున శుభాకాంక్షలు చెప్పారు. చివరగా ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమచార్యులతో పాటు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఇతర భాషా పరిశ్రమలకు చెందిన వారిని కూడా అభినందించారు.