ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకొని నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు వచ్చారు. విమానాశ్రయం దగ్గర అభిమానులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘జై విజ్ఞాన్.. జై అనుసంధాన్’ నినదించారు.
ప్రధాని విమానాశ్రయం నుంచి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్-3 ప్రయోగం తీరును ప్రధానికి సోమనాథ్ వివరించారు. అలాగే చంద్రయాన్-3 బృందంతో ఫోటోలు తీసుకున్నారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళుతోందని పేర్కొంటూ అంతరిక్ష అరంగంలో భారత్ చరిత్ర సృష్టించిందని, ఎవరు సాధించలేని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారని ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా అలాగే ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. అట్లాగే చంద్రయాన్ 3 చంద్రుడిపై దిగిన ప్రదేశాన్ని `శివశక్తి’గా నామకరణ చేశారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాను సౌతాఫ్రికాలో ఉన్నా తన మనసంతా ఇక్కడే ఉందని.. చంద్రయాన్ విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. అలాగే చంద్రయాన్ 3 విజయవంతంలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర ఎంతో ఉందని.. మన దేశ నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటామనిచెప్పారు .
ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించామని.. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసిందని అంటూ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో సాధించిన విజయం దేశానికే గర్వకారణమని.. భారత్ శక్తిసామర్థ్యాలను ప్రపంచం కీర్తిస్తోందని పేర్కొన్నారు. చంద్రుడిపై భారత్ అడుగు పెట్టడం మామూలు విజయం కాదన్నారు. భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి ఇస్రో చూపించిందని.. మన దేశం ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతోందన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలు దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారని.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన ప్రదేశానికి శివశక్తి అనే పేరు పెట్టుకుందామని సూచించారు. ప్రతి ఇంటిపైనే కాదు చంద్రుడిపై భారత్ జెండా ఎగరడం గర్వంగా ఉందన్నారు. చంద్రయాన్ -2 వైఫల్యంతో ఎక్కడా వెనకడుగు వేయలేదని, మరింత పట్టుదలతో పనిచేసి చంద్రయాన్ -3 విజయాన్ని అందుకున్నామని.. ఇస్రో ప్రపంచానికే భారత్ దిక్సూచిగా మారుతోందని ప్రధాని వివరించారు.
దేశాభివృద్ధిలో స్పేస్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది అన్నారు. ‘మేకిన్ ఇండియా’ ఇప్పుడు చంద్రుడి వరకు సాగిందని.. మంగళ్యాన్, చంద్రయాన్ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదామన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఈ విజ్ఞానం ఉపయోగపడాలని.. రాబోయే రోజుల్లో తుఫాన్లను అంచనా వేయడంతో మరింత నైపుణ్యం సాధించాలన్నారు. వాతావరణ మార్పులను మరింత కచ్చితంగా తెలుసుకోవాలి చెప్పారు.