సెప్టెంబర్ 2న ప్రయోగించనున్న ఆదిత్య ఎల్1 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగం సరికొత్త చరిత్ర సృష్టించడంతో సూర్యడిపై పరిశోధనల కోసం ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్ 1 ఎప్పుడెప్పుడా అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఇస్రో ట్విట్టర్ ఎక్స్‌లో శ్రీహరికోట పేరు ట్రెండ్ అవుతుంది.
సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 11.50 గంటలకు జరుగునున్న పిఎస్ఎల్వి సి-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 ప్రయోగించనున్నారు. ఆ సమయంలో పీఎస్ఎల్వీ సి-57 ప్రయోగ వీక్షణ కోసం అప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
వాస్తవానికి ప్రయోగ సమయం రోజే ఎల్ 1 పరిధిలోకి ఉపగ్రహం చేరే అవకాశాలు లేవు. ఏకంగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్1(ఎల్1) అనే చోట హాలో కక్షలో ఉపగ్రహం చేరి సూర్యుడుపై పరిశోధనలు చేస్తుంది. ఇందుకుగాను నాలుగు నెలలకు పైగా సమయం పడుతుంది.
చంద్రయాన్-3 అంచెలంచెలగా దాటుకొని 3 లక్షల 80 వేల కిలోమీటర్లు చేరేందుకు 41 రోజుల సమయం పట్టింది. ఇది ప్రస్తుతం సుమారు నాలుగింతల ప్రయాణం ఎక్కువ చేయాల్సి ఉంది. అయితే భూకక్ష్యలో సౌర కక్ష్యలో తిరిగే అవసరం లేకుండా అంతరిక్ష కక్ష నుంచి నేరుగా లాగ్రాంజ్ 1 ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్న కారణంగా నాలుగు నెలలు సమయం సరిపోతుందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ ఆదిత్య ఎల్1లో 7 ఉపకరణాలను సూర్య పరిశోధనల కోసం పంపిస్తున్నారు. వాటిని ఇప్పటికే రాకెట్ శీర్ష భాగంలో ఉన్న ఆదిత్య ఎల్1లో అమర్చి ఉన్నారు. అమెరికా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనాల తర్వాత సూర్య పరిశోధనల కోసం ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్న 5వ దేశం మనది.
సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యాయం చేసేందుకు వీలుగా ఆదిత్య ఎల్1లో అమర్చిన ఏడు పేలోడ్లు పనితీరు ప్రదర్శించాల్సి ఉంది. ఇందులో నాలుగు పేలోడ్లు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే, మిగతా మూడు పేలోడ్లు సమీపంలోని సౌర రుణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోదిస్తాయి. అందుకనే వీటిని రెండు భాగాలుగా ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో అమర్చి ఉన్నారు.
శ్రీహరికోటలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి పిఎస్ఎల్వి సి-57 ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి లాంచ్ రిహార్సర్స్ అనంతరం గురువారం వర్చువల్ విధానంలో ఎంఆర్ఆర్ సమావేశం జరపనున్నారు. శ్రీహరికోటలో ప్రస్తుతం ఆదిత్య ఎల్ 1 ప్రయోగంపై ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి దృష్టి కేంద్రీకరించారు.