జమ్ముకశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా ? అని భారత సర్వోన్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు కేంద్రం గురువారం బదులిచ్చింది.
రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి అవసరమైన నియమావళిని రూపొందిస్తున్నామని, కొంత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది. అయితే అందుకు నిర్దిష్ట గడువు పెట్టలేమని తెలిపింది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలో కేంద్ర ఎన్నికల కమిషన్, జమ్మూ-కశ్మీరు ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తాయని తెలిపింది. తొలి దశలో పంచాయతీ ఎన్నికలు, రెండో దశలో పురపాలక సంఘాల ఎన్నికలు, మూడో దశలో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని వివరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వివరాలను గురువారం తెలిపారు. ఇప్పటికే పంచాయతీ, జిల్లా మండలి ఎన్నికలు పూర్తయ్యాయని చెబుతూ, మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరపడానికైనా ప్రభుత్వం సిద్దమే అని తెలిపారు.
జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. గతంలో రాష్ట్రంగా ఉన్న జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం చాలా అవసరమని కేంద్రం వాదించింది.
సుప్రీంకోర్టు మంగళవారం స్పందిస్తూ, జమ్మూ-కశ్మీరులో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగడం తప్పనిసరి అని తెలిపింది. ఇక్కడ 2018 జూన్ నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదని గుర్తు చేసింది. జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదా ఇవ్వడానికి కాల పరిమితిని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం తిరస్కరించింది.
అధికరణ 370ని రద్దు చేయడంలోనూ, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంలోనూ సముచిత ప్రక్రియను అనుసరించారా? లేదా? అనే అంశంపై ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతుందని సొలిసిటర్ జనరల్ చెప్పడంతో అక్కడి నేతలు, పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని రెండేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అధికరణ 370ని రద్దు చేయడంతోపాటు, జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. సరైన సమయంలో జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్ర హోంమంత్ర అమిత్ షా అప్పట్లో పార్లమెంటుకు చెప్పారు. కానీ సమయాన్ని నిర్దేశించలేదు.