ఈ వారం చివరిలో భారత్‌లో జరగబోయే జి 20 సదస్సును హైజాక్ చేయడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విమర్శించింది. అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్యపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించడానికి బదులుగా ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన ఎజెండాను అమలు చేయడానికి కొన్ని దేశాలు రాబోయే జి 20 సదస్సును ఉపయోగించుకుంటాయని రష్యా మండిపడింది.
భారత్ లో జరగనున్న సదస్సు నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రష్యా రాయబారి డెన్నిస్ అలిపొవ్ మాట్లాడుతూ, ”దురదృష్టవశాత్తూ, జి 20కి అధ్యక్షురాలిగా వున్న భారత్ కొన్ని దేశాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వారు జి 20 ఎజెండాను హైజాక్ చేస్తున్నారు. చర్చనీయాంశాల్లో ఉక్రెయిన్ సంక్షోభాన్ని చేర్చాలని చూస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
”జి 20 దేశాలు ఆర్థిక, ద్రవ్యపరమైన అంశాలపైనే దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. కానీ గత ఏడాది నుండి, కొన్ని రాజకీయ అంశాలను కూడా చర్చిం చాలని ఈ గ్రూపులోని కొంతమంది సభ్యులు నిర్ణయించారు. అది మాకు ఆమోద యోగ్యం కాదు.” అని అలీపోవ్ చెప్పారు.
ఈ అంశాన్ని ఎజెండాలో భాగంగా చేర్చడంపై ఏకాభిప్రాయం రాని పక్షంలో దాన్ని తొలగించాలని స్పష్టం చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చర్చించి, స్పందించేందుకు జి 20 ఏర్పాటైందని, భౌగోళిక, రాజకీయ సమస్యల కోసం కాదని చెప్పారు. మరే ఇతర సముచితమైన వేదికలపైనైనా ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించడానికి మాస్కో సిద్ధంగా వుందని తేల్చి చెప్పారు.
జి 20కి అధ్యక్షురాలిగా భారత్‌కు గల ప్రాధాన్యతలకు రష్యా మద్దతిస్తుందని ఆయన చెప్పారు. వీటిలో సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు, సర్వతోముఖాభివృద్ధి, డిజిటల్‌కు పరివర్తన వంటి అనేక అంశాలు వున్నాయని పేర్కొన్నారు. భారత్ ఇప్పటికే ఏదైతే ఎజెండా పెట్టిందో దానిపైనే చర్చజరగగలదని ఆశిస్తున్నట్లు రష్యా పేర్కొంది.
అంతర్జాతీయ వ్యవహరాల్లో భారత్ పాత్ర గురించి మాట్లాడుతూ, అతి త్వరలోనే నిర్ణయాత్మక కేంద్రాల్లో ఒకటిగా భారత్ మారుతుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా, సమానత్వం, న్యాయంతో కూడిన బహుళ ధృవ ప్రపంచానికి మద్దతునివ్వాలన్నదే తమ ప్రాధాన్యత అని అలీపోవ్ చెప్పారు.
జి 20 సదస్సులో పాల్గనేందుకు వచ్చే వారం భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన చేసింది. 9. 10 తేదీల్లో జి 20 సదస్సు జరుగుతుండగా, దానికి ఒక రోజు ముందుగా ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. పరిశుద్ధ ఇంధనానికి పరివర్తన చెందడంతోపాటు వాతావరణ మార్పులపై పోరు సహా పలు అంతర్జాతీయ అంశాలపై ఉమ్మడిగా సాగించాల్సిన పోరాటంపై జి 20 దేశాలు చర్చిస్తాయి.