తెలంగాణాలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గత వారం రోజుల్లో రోజురోజుకూ కేసులు రెట్టింపయ్యాయి. మూడువారాల కిందట రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదవగా ఆదివారం నాటికి ఈ కేసులు 84కు చేరుకున్నాయి. ఇదే సమయం లో క్షేత్రస్థాయిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
దాదాపు 3 నెలల తర్వాత రాష్ట్రంలో ఒక్క రోజులో 300కు పైబడి కేసులు నమోదవగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే దాదాపు 200 కేసులు తేలాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక సూత్రాల ప్రకారం రిస్క్ దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు ఒమిక్రాన్ పరీక్షలు జరుపుతున్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వాళ్లలో 2 శాతం మందికే పరీక్షలు చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు నమోదైన కేసులలో 70 శాతం నాన్- రిస్క్ దేశాల నుండి వచ్చిన వారే కావడంతో, ఇప్పటికే ఇది కమ్యూనిటీలోకి వెళ్లి ఉంటుందని వైద్యారోగ్య వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ ఉండొచ్చని భావిస్తున్నాయి.
ఓవైపు జనజీవనం సాధారణ స్థితికి చేరుకోవడం, మరోవైపు సంక్రాంతి రాకపోకలు పెరుగుతుండటం, పైగా ప్రజలు కరోనా జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో రెండు వారాల్లో రాష్ట్రంలో రోజుకు వెయ్యి కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నాయి. పైగా, పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ పరీక్షలు జరపడానికి కూడా సదుపాయాలు అందుబాటులో లేవు.
కరోనా వైరస్‌ను ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు (ర్యాట్), ఆర్టీపీసీఆర్ పరీక్షలతో గుర్తిస్తున్నారు. అయితే వైరస్‌ను నిర్ధారించినా అందులోని వేరియంట్ గుర్తించాలంటే జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరీక్షలు సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ), సీడీఎఫ్‌డీ (సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్స్), గాంధీ ఆస్పత్రులే చేస్తున్నాయి.
సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ సంస్థల పరిధిలో నెలకు సగటున 6 వేల జీనోమ్ సీక్వెన్సింగ్‌లు చేసే సామర్థ్యం మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర కర్ణాటక రీజియన్ పరీక్షలు కూడా ఈ సంస్థలే చేస్తున్నాయి. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ కిట్ విలువ రూ. 6 వేల వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. శాంపిల్ తీసుకున్నాక 4 దశల్లో విశ్లేషణ చేసి ఫలితాలు వెల్లడిస్తారు.
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై పెద్దగా నిఘా పెట్టకపోవడం, మరోవైపు రోడ్డు మార్గాల ద్వారా కూడా ప్రయాణికుల రాకపోకలు ఉండటంతో ఒమిక్రాన్ అధికారిక గణనకలకు పన్నురేట్లు వ్యాపించి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పైగా క్షేత్రస్థాయి కేసుల్లోని కేసుల్లో ఒమిక్రాన్ వేరియెంట్‌ను గుర్తించట్లేదు.