సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ వడివడిగా దూసుకెళ్తోంది. అయితే మంగళవారం తెల్లవారుజామున ఆదిత్య ఎల్1 మరో కక్ష్యలోకి ప్రవేశించింది. కక్ష్య మార్పు ప్రక్రియను రెండోసారి ఇస్రో చేపట్టింది. బెంగుళూరులో ఉన్న ఐఎస్టీఆర్ఏసీ సెంటర్ నుంచి ఆ ఎర్త్బౌండ్ మాన్యువర్‌ను విజయవంతంగా చేపట్టారు.
మారిషస్, బెంగుళూరు, పోర్టు బ్లెయిర్‌లో ఉన్న ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు ఆ కక్ష్యమార్పు ఆపరేషన్ సమయంలో శాటిలైట్‌ను ట్రాక్ చేశాయి. 282 కిమీ x 40225 కిమీ వద్ద.. ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ కొత్త కక్ష్యలోకి ప్రవేశించింది. ఇక ఈనెల 10వ తేదీన మూడవ సారి కక్ష్య మార్పు ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.
సెప్టెంబర్ 10వ తేదీన తెల్లవారుజామున 2.30 నిమిషాలకు ఆ స్టంట్ ఉంటుందని ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఆదిత్య ఎల్-1 కక్ష్యను గత ఆదివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో తొలిసారిగా ఎర్త్బౌండ్ ఫైరింగ్‌తో కక్ష్యను మార్చారు. పీఎస్ఎల్ వీ సీ-57 వాహకనౌక ద్వారా ఆదిత్య ఎల్-1ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపిన విషయం తెలిసిందే.
ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం భూమి కక్ష్యలోనే 16 రోజుల పాటు ఉండనున్నది. ఐదుసార్లు కక్ష్యను మార్చుకొని లాగ్రాంజియన్-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచే ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది. ఈ లాగ్రాంజియన్ పాయింట్ భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది.