సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను ఆదేశించారు. చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దని, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని తెలిపారు. ఈ అంశంలో ప్రస్తుత, సమకాలిక పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేశారు.
ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమావేశాల నేపథ్యంలో మోదీ బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇటీవల తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని మంత్రులను ఆదేశించారు.
‘‘చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దు, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలి. ఈ అంశంలో సమకాలిక పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాలి’’ అని మంత్రులకు మోదీ చెప్పారు. ఇండియా వర్సెస్ భారత్ వివాదంపై వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారు. ఈ అంశంపై అధీకృత వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని తెలిపారు.
ఉదయనిధి, ప్రియాంక్ ఖర్గేలపై యూపీలో కేసు
మరోవంక, మతపరమైన మనోభావాలను గాయపరచారనే ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరూ తమ మనోభావాలను దెబ్బతీశారని న్యాయవాదులు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోఢీ చేసిన ఫిర్యాదులపై ఈ చర్య తీసుకున్నారు.
‘సనాతన ధర్మ నిర్మూలన’ పేరుతో తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల సంఘం చెన్నైలో గత వారం ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. వీటిని కేవలం వ్యతిరేకించలేమని, అంతం చేయాలని, నిర్మూలించాలని, అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని పేర్కొన్నారు.
దీనిపై వివాదం రేగిన తర్వాత కూడా ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు. మరోవైపు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు) మాట్లాడుతూ, ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతిచ్చారు. సమానత్వాన్ని ప్రోత్సహించని ఏ మతమైనా, మానవుడిగా హుందాగా జీవించేందుకు భరోసానివ్వని ఏ మతమైనా, తన దృష్టిలో మతం కాదని చెప్పారు.
ఉదయనిధి, ప్రియాంక్ వ్యాఖ్యల కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోఢీ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి వ్యాఖ్యలతో కూడిన మీడియా కథనాలను ఫిర్యాదులకు జత చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్ పోలీసులు ఈ ఫిర్యాదులను స్వీకరించి, ఉదయనిధి, ప్రియాంక్లపై బుధవారం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 153ఏ (వేర్వేరు మత సముదాయాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), ఐపీసీ సెక్షన్ 295ఏ (మతపరమైన మనోభావాలను భంగపరచేందుకు ఉద్దేశపూర్వకంగా, దుశ్చర్యలకు పాల్పడటం) ప్రకారం ఆరోపణలను నమోదు చేశారు.
ఇదిలావుండగా, ఉదయనిధి స్టాలిన్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ దాదాపు 260 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో విశ్రాంత న్యాయమూర్తులు, పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
