ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ నెల 19న వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని కొత్త భవనంలో సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అయితే అధికారికంగా అటు ప్రభుత్వం నుంచి, పార్లమెంట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను తొలి రోజు పాత భవనంలోనే నిర్వహించి, రెండో రోజు నుంచి కొత్త భవనంలో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది.
ఇవి ప్రత్యేక సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్ బిజినెస్ వంటివేవీ ఉండవని, కేవలం ప్రభుత్వ బిజినెస్ మాత్రమే ఉంటుందని అధికారులు వెల్లడించారు. అంటే కేవలం బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చ, ఓటింగ్, పాస్ చేయడం వంటి కార్యాకలాపాల కోసమే ఈ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టింది.
కాగా, ఏ రాజకీయ పార్టీని సంప్రదించుకుండానే పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసిన ఆమె కేవలం ప్రభుత్వ బిజినెస్ మాత్రమే ఉంటుందని తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు.
అయినప్పటికీ ఈ స్పెషల్ సెషన్లో పాల్గొంటామని సోనియా తెలిపారు. ఒకరకంగా దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేందుకు, సభలో లేవనెత్తేందుకు ఇదొక అవకాశంగా భావిస్తామని ఆమె పేర్కొన్నారు. తాము లేవనెత్తబోయే ప్రజా సమస్యలపై చర్చించడానికి తగిన సమయం కేటాయించాలని ప్రధాని మోదీని ఆమె కోరారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం పై చర్చించాలని ఆమె సూచించారు. రైతు సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలపై కూడా చర్చ జరగాలన్నారు. అలాగే అదానీ గ్రూపు వ్యాపారాలు, లావాదేవీలపై ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’తో విచారణ జరిపించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
మణిపూర్ హింస, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని, హర్యానాలో చోటుచేసుకున్న మత హింస నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న మత విద్వేషాలపై కూడా చర్చించాలి ఆమె తన లేఖలో కోరారు.
అయితే, ఆమె ఆ విధంగా ప్రధానికి లేఖ వ్రాయడం పట్ల మండిపడుతూ మన ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు పనితీరును రాజకీయం చేసి అనవసర వివాదాలు సృష్టించేందుకు ఆమె ప్రయత్నించడం చాలా దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాలను పిలిచే ముందు రాజకీయ పార్టీలను ఎప్పుడూ సంప్రదించే సంప్రదాయం లేదని ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ నేతకు రాసిన లేఖలో గుర్తు చేశారు.
“బహుశా, మీరు సంప్రదాయాలను పట్టించుకోరు. పార్లమెంటు సమావేశాన్ని పిలవడానికి ముందు, రాజకీయ పార్టీలతో చర్చలు జరపరు లేదా సమస్యల గురించి ఎప్పుడూ చర్చించరు” అని ఆయన స్పష్టం చేశారు. సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్ష నేతల సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో పార్లమెంట్ అంశాలు, పనితీరుపై చర్చిస్తామని మంత్రి తెలిపారు.