ఢిల్లీ వేదికగా శనివారం ప్రారంభమైన రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సమావేశాలు ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపాయి. దీంతో.. ఇది భారతదేశానికి భారీ విజయంగా పరిగణిస్తున్నారు. ఇందులో మునుపటి సమావేశాల కన్నా ఎక్కువ ఫలితాలతో పాటు రికార్డ్ స్థాయిలో పత్రాలు ఉన్నాయి.
ఉక్రెయిన్‌లో యుద్ధం, వాతావరణ మార్పులను పరిష్కరించడంలో భిన్నాభిప్రాయాల కారణంగా న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం పొందేందుకు కొంచెం ఆలస్యం అయ్యింది. ఏదైమైనా.. దీనిపై ఏకాభిప్రాయం రావడంతో ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ఒక శుభవార్త. మా బృందం కృషి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మద్దతుతో న్యూ ఢిల్లీ జీ20 లీడర్ల సమ్మిట్ డిక్లరేషన్ ఏకాభిప్రాయానికి చేరుకుంది’’ అని చెప్పారు. దీనిని జి20 నాయకులందరూ స్వీకరించాలని, ఇది జరుగుతుందని తాను ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది సాధ్యమయ్యేలా కృషి చేసిన మంత్రులకు, షెర్పాలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అటు.. జీ20 సమావేశాల్లో పాల్గొనడం కోసం భారత్‌కు వచ్చిన విదేశాంగ మంత్రులు వాతావరణంతో పాటు ఇతర సవాళ్లను ఎదుర్కోవడానికి అంగీకారం తెలిపారు.
ఉక్రెయిన్‌కు జీ20 సదస్సు బాసటగా నిలిచింది. ఆ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా బలవంతంగా ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రపంచ దేశాల అధినేతలు వ్యతిరేకించారు. అలాగే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడాన్ని ఖండించారు. ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ, యూఎన్ భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాలను పునరుద్ఘాటించారు.
యూఎన్ చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అయితే రష్యా పేరును నేరుగా ప్రస్తావించకుండా ఈ మేరకు రూపొందించిన ‘ఢిల్లీ డిక్లరేషన్’పై జీ20 దేశాల ప్రతినిధులు సుదీర్ఘంగా మంతనాలు జరిపి చివరకు తమ సమ్మతిని తెలియజేశారు.
కాగా, అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 ప్రధాన వేదిక అని ‘ఢిల్లీ డిక్లరేషన్’లో పేర్కొన్నారు. అయితే భౌగోళిక, రాజకీయ, భద్రతా సమస్యలను పరిష్కరించడానికి వేదిక కానప్పటికీ, ఈ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఖండించాల్సిందేనని జీ 20 కూటమి స్పష్టం చేసింది. ఈ మేరకు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం, ఆర్థిక, రాజకీయ, వస్తుపరమైన సహాయం లభించకుండా అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చింది. మతపరంగా వ్యక్తులకు, చిహ్నాలకు, మతగ్రంథాలకు వ్యతిరేకంగా ఏ రకమైన విద్వేషాన్ని అయినా జీ 20 ఖండిస్తుందని ప్రకటించింది.
మతపరమైన స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశం కావటం, సంఘాలు పెట్టుకునే హక్కు ఎంతో కీలకమైనవని, వాటిని బలోపేతం చేయటానికి కృషి చేస్తామని తెలిపింది. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తామని, అందరికీ విద్య లభించటానికి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. శి
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ పూరి మాట్లాడుతూ జీ20 చరిత్రలో భారత జీ20 ప్రెసిడెన్సీ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. ఈ సమ్మిట్‌లో ఏకాభిప్రాయం పొందిన న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌లో 73 ఫలితాలతో పాటు 39 అనుబంధ పత్రాలున్నాయని తెలిపారు. ఇది మునుపటి సమావేశాల కంటే రెండు రెట్లు ఎక్కువ అని చెప్పారు. దీని వల్ల యుద్ధ యుగం ముగుస్తుందని, కరోనా తర్వాత ప్రపంచంలో ఇది ప్రధాన మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.
మరోవంక, భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు కనెక్టివిటీ కారిడార్‌ను ప్రపంచ నేతలు ప్రారంభించాలని ఈ సదస్సులో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ కారిడార్ కనెక్టివిటీ స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక ఏకీకరణకు దోహదపడుతుందని ప్రధాని మోదీ పేర్కొంటూ ఇది చారిత్రక ఒప్పందమని కొనియాడారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థిరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం, వాటిపై పెట్టుబడులు పెట్టడం, మెరుగైన భవిష్యత్తును సృష్టించడం గొప్ప విషయమని అన్నారు. ఇది చారిత్రక ప్రయోగమని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అభివర్ణించారు.