క్రిమినల్ కేసుల విచారణ సమయంలో పోలీసుల ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పక్షపాతంతో కూడిన రిపోర్ట్‌తో నిందితుడు నేరం చేశాడనే అనుమానాలకు తావిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈ మేరకు నిందితులు, బాధితుల ఇద్దరి హక్కులను పరిరక్షిస్తూ సున్నితమైన కేసుల్లో మీడియాకు తెలియజేయాల్సిన, చేయకూడని విషయాలపై పోలీసుల అధికారులకు సూచనలు ఇస్తూ మాన్యువల్‌ను రూపొందించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.
మూడునెలల్లోగా సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని.. అన్ని రాష్ట్రాల డీజీపీలు సూచనలు చేయడంతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయాలను సైతం తీసుకోవాలని సూచించింది. క్రిమినల్ కేసులు దర్యాప్తు జరుగుతున్న సమయంలో పోలీసులు అనుసరిస్తున్న విధివిధానాలపై దాఖలైన పిటిషన్‌పై సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరిపింది.
‘పీయూసీఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ 2014 కేసు తీర్పులో ఎన్కౌంటర్ల విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ, ప్రెస్ బ్రీఫింగ్‌పై స్పష్టత రాలేదు. ఈ విషయంపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. ఎలక్ట్రానిక్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాముఖ్యతను సంతరించుకుందని కోర్టు అభిప్రాయపడింది.
నేరాలకు సంబంధించి పోలీస్ మీడియా బ్రీఫింగ్‌లను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. న్యాయస్థానంలో నేరం రుజువు చేసే వరకు వ్యక్తి నిర్దోషి అని.. పక్షపాతంతో కూడిన రిపోర్టింగ్ నిందితులతో పాటు బాధితుల ప్రతిష్టను సైతం దెబ్బతీస్తాయని, దాంతో పాటు దర్యాప్తును అడ్డుకునే అవకాశం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఉన్న మాన్యువల్ దశాబ్దానికిపైగా పాతదని బెంచ్ పేర్కొంది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ మాట్లాడుతూ సోషల్ మీడియా రాకతో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. సమాచార హక్కు, న్యాయ విచారణ హక్కులు, సమర్థవంతమైన దర్యాప్తు ఒక కేసులో ప్రమేయం ఉన్న నిందితులు, బాధితుల గోప్యత, గౌరవానికి సంబంధించిన హక్కును సమతుల్యం చేయడం ముఖ్యమని అంగీకరించారు.
ఈ మేరకు మూడునెలల్లోగా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనలతో మాన్యువల్‌ను సిద్ధం చేయాలని కోర్టు హోంమంత్రిత్వ శాఖను ఆదేశించింది. కేసు విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా 2016లో అప్పటి సీజేఐ జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ సైతం మీడియా బ్రీఫింగ్‌పై ఇదేవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.