మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలని కోరారు.
ఈ క్రమం లోనే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంకిత్ బైయాన్ పురియాతో కలిసి ప్రధాని మోదీ శ్రమదానం చేశారు. స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. చెత్తను గంపల్లోకి ఎత్తారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
‘ దేశమంతా స్వచ్ఛతపై దృష్టి సారిస్తోన్న తరుణంలో .. అంకిత్ బైయాన్‌పురియా, నేను కలిసి ఇదే కార్యక్రమం చేపట్టాం. కేవలం పరిశుభ్రతకే పరిమితం కాకుండా , ఫిట్నెస్, ఆ రోగ్యాన్ని కూడా ఇందులో మిళితం చేశాం. ఈ కార్యక్రమం .. పరిశుభ్ర ఆ రోగ్య భారతం సందేశాన్ని అందిస్తోంది.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నా రు.
కేంద్ర మంత్రులు అమిత్‌షా, అనురాగ్ ఠాకూర్ తదితరులతోపాటు బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి. కేంద్ర గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల శాఖ ప్రకారం దేశ వ్యాప్తంగా 9.20 లక్షలకు పైగా ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో శ్రమదాన్ ఫర్ క్లీనెస్ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్‌షా పా ల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఢిల్లీలో జరిగిన స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పాల్గొని చీపురుపట్టి చెత్తను ఊడ్చేశారు.
కాగా, జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రముఖులు సోమవారం నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రదాని మోదీ, రాజ్యసభలో విపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, మీనాక్షీ లేఖి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
