భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆధునిక అమెరికా ఇండియా స్నేహ సంబంధాల రూపశిల్పి అని అమెరికాలోని బైడెన్ అధికార యంత్రాంగం కొనియాడింది. ఇప్పుడు ఇరు దేశాల నడుమ భాగస్వామ్యం అత్యంత నిర్ణయాత్మక సమున్నత దశకు చేరిందని పలువురు అధికారులు తెలిపారు.
ఇందుకు తగు రీతిలో జైశంకర్ చూపిన చొరవ కారణం అని చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఇక్కడి ఇండియా రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మానం ఏర్పాటు అయింది.
ఈ సభకు పలువురు ప్రముఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. యుఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రిచర్డ్ వెర్మా, పాలసీ సలహాదారు నీరా టాండెన్, , డాక్టర్ రాహుల్ గుప్తా, డాక్టర్ సేతురామన్ పంచనాథన్ జైశంకర్‌ను ప్రశసించారు. వీరంతా బైడెన్ కొలువులో కీలక స్థానాల వారే.
ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు అపూర్వ స్థాయికి చేరాయని, దీనిని కాదనే వారు ఎవరూ లేరని, రెండు మిత్రదేశాల నడుమ స్నేహం మరింతగా మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారి ఆదర్శాల ఊతంతో మరింతగా విస్తరించుకున్నాయని వక్తలు తెలిపారు.
కాగా, ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనేది భారత్ నినాదం అని విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారు. అమెరికాలోని వాషింగ్టన్లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సమష్టి జీవన విధానం మరింత మెరుగుపడిందని జై శంకర్ తెలిపారు. ప్రపంచంలో వాతావరణ మార్పు, ఆర్థిక పురోగతి, సామాజిక శ్రేయస్సువంటి పెద్ద సవాళ్లను ఒంటరిగా సమర్థవంతంగా పరిష్కరించలేమని… ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఈ విధానంలోనే భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిందని చెప్పారు. భారత్ థీమ్ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ను నేడు సాంస్కృతికంగా ఎంతో బాగా ప్రదర్శించామని వెల్లడించారు. ‘మా బాధ్యతలను నిర్వర్తించి.. స్థిరమైన అభివృద్ధి, హరిత వృద్ధి, డిజిటల్ డెలివరీలో నూతన శక్తిని నెలకొల్పామని చెప్పేందుకు గర్వపడుతున్నాను’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు.