ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పిఎస్) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ పంజాబ్ వర్సెస్ దవిందర్ సింగ్ కేసుకు అటాచ్ చేసింది. రిజర్వేషన్లకు సంబంధించిన అంశమైనందున రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోన్న దవిందర్ కేసుకు జత చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఎస్సి రిజర్వేషన్లు చేపట్టాలంటూ ఎంఆర్పిఎస్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్ను ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అటాచ్ చేస్తున్నట్లు పేర్కొంది.
వాదనల సందర్భంగా ఎస్సి లలో మాదిగ సామాజిక వర్గం అత్యంత వెనుకబడి ఉందని పిటిషనర్ తెలిపారు. రిజర్వేషన్ ఫలాలు మాదిగలకు సక్రమంగా అందడంలేదని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందిస్తూ పంజాబ్ వర్సెస్ దేవీందర్ కేసు విస్తృత ధర్మాసనం ఎదుట ఉందని సిజెఐ తెలిపారు. అది కూడా రిజర్వేషన్ల వర్గీకరణకు చెందిన అంశం కావడంతో, ఎమ్మార్పీఎస్ పిటిషన్ను ఆ కేసుకు జత చేస్తున్నామని వెల్లడించారు.