గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌లతో సహా టెక్ కంపెనీలు దాదాపు 4,00,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. అదే సమయంలో 110 భారతీయ స్టార్టప్‌లు భారత్‌లో 30 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపాయి. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులను ఉటంకిస్తూ, స్పెక్ట్రమ్‌లోని బిగ్ టెక్ సంస్థలు, స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి.
ఈ తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2022లో మొదలైన ఈ టెక్ సంక్షోభ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకర స్థాయికి చేరింది. కొత్త ఉద్యోగాల సృష్టికి బదులు, కంపెనీలు లేఆఫ్‌లు అమలు చేస్తుండటం సాఫ్ట్వేర్ రంగంలోకి ప్రవేశిస్తున్న ఔత్సాహికులకు ఒకింత భయాలను కలిగిస్తున్నాయి.
టెక్ సెక్టార్ ఉద్యోగాల కోతలను ట్రాక్‌చేసే లేఆఫ్ డాట్ ఫై అనే వెబ్సైట్ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు 4,04,962మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 1061 టెక్ కంపెనీలు 1,64,769 మంది ఉద్యోగులను తొలగించగా, 2023లో 1059 కంపెనీలు ఇప్పటి వరకు (అక్టోబర్ 13) 2,40,193 మంది ఉద్యోగులను తొలగించాయి.
సగటున గత రెండేళ్లలోన ప్రతిరోజు దాదాపు 555 మంది ఉద్యోగులకు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అంటే ప్రతి గంటకు 23మంది ఇంటి ముఖం పట్టారు. ఒక్క జనవరిలోనే 89,554 మంది ఉద్యోగులను తొలగించడం జరిగింది. ఇప్పటికీ లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ జనవరి అంతటి ఉధృతంగా మాత్రం లేవు.
గత నెలలో (సెప్టెంబర్) కూడా 4,632 మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. సెక్టార్ పరంగా రిటైల్ టెక్, కన్స్యూమర్ టెక్ ఈ ఏడాది ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ రెండు రంగాల్లో వరుసగా, దాదాపు 29,161 మంది, 28,873 మంది ఉద్యోగులపై వేటుపడింది.
అమెరికన్ చిప్ దిగ్గజం క్వాల్‌కాం లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల్లో 2.5 శాతం మంది అంటే దాదాపు 1258 మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది. ఆర్ధిక అనిశ్చితి, సెమీకండక్టర్ పరిశ్రమలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించినట్టు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్లో కొలువుల కోత చేపడతామని క్వాల్‌కాం స్పష్టం చేసింది.
శాండియాగో, శాంటా క్లారా ప్లాంట్స్‌లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని పేర్కొంది. అయితే ప్లాంట్ల మూసివేత ఉండబోదని వెల్లడించింది. స్ధూల ఆర్థిక పరిస్ధితుల అనిశ్చితి, డిమాండ్ మందగమనంతో ఈ చర్యలు చేపడుతున్నామని, కీలక వృద్ధి, వైవిధ్య అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో సంక్లిష్ట నిర్ణయాలు తప్పలేదని కంపెనీ పేర్కొంది.
ఈ మేరకు కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ఇటీవల దాఖలు చేసిన సమాచారం ప్రకారం, శాన్ డియాగో నుండి 1,064 మంది, శాంటా క్లారా నుండి 194 మందిని తొలగించనున్నారు. ఉద్యోగాల కోతలు డిసెంబర్ 13 నుండి రెండు కార్యాలయాల్లో అమల్లోకి వస్తాయని నివేదిక పేర్కొంది.
ఈ తాజా ఉద్యోగాల తగ్గింపు దాని శ్రామిక శక్తిలో దాదాపు 2.5 శాతం వరకు ఉంటుంది. కంపెనీ యొక్క ఇటీవలి వార్షిక ఆర్థిక నివేదిక ప్రకారం, (సెప్టెంబర్ 2022 నాటికి) ఇది 51,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.
డిసెంబర్ లో లేఆఫ్స్‌ను ముందుకు తీసుకువెళ్లనుండటంతో బాధిత ఉద్యోగులతో పాటు టెక్ పరిశ్రమ క్వాల్‌కాం భవిష్యత్ చర్యలను, కంపెనీ కార్యకలాపాలపై దీని ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నది. వేటు పడనున్న ఉద్యోగులకు క్వాల్‌కాం ఎలాంటి పరిహార ప్యాకేజి వర్తింపచేస్తుందనే వివరాలపై ఇప్పటివరకూ కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.