టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్కిల్ డవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడిగా, వేడిగా శుక్రవారం వాదనలు సాగాయి. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
స్కిల్ డవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, సిఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తొలుత క్వాష్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసి గుప్తా కేసును ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు.
‘చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు పాత చట్టంలోని సెక్షన్స్ వర్తిస్తాయి. చట్టాన్ని రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుంది. కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదు’ అని రోహత్గి తెలిపారు.
చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. ‘కేసులపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారు. స్కిల్ కేసు విచారణకు ఫైబర్నెట్ కేసుతో సంబంధం ఉంది. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంటు తీసుకున్నారు’ అని లూథ్రా పేర్కొన్నారు.
ఇక్కడ కూడా 17 ఏను ఛాలెంజ్ చేస్తున్నారా? అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించగా.. అవును.. 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని లూథ్రా తెలిపారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ తరువాత చేస్తామని ధర్మాసనం పేర్కొంది.
17 ఏ పూర్తిస్థాయి రక్షణేమీ కాదని, అది కేవలం చిన్నపాటి రక్షణే అని, కేసుపెట్టే అధికారమే పోలీసులకు లేనప్పుడు కేసు ఎలా ఫైల్ చేస్తారని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. సుదీర్ఘ వాదనలు తరువాత తదుపరి విచారణను వచ్చే మంగళవారం (అక్టోబరు 17) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
ఆ తరువాత జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చిందని తెలిపారు.
ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని, మరికొంతమంది ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు చంద్రబాబుకు బెయిల్ ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ ప్రస్తావన కూడా ఉన్నందున తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు.
ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న సిద్ధార్థ లూథ్రా ‘మంగళవారానికి విచారణ వాయిదా వేయడం వల్ల ప్రయోజనం లేదు. చంద్రబాబును సోమవారం ఎసిబి కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టులో హాజరుపరిచాకా ముందస్తు బెయిల్ అన్న పదమే ఉత్పన్నం కాదు’ అని చెప్పారు. దీనికి స్పందించిన జస్టిస్ బోస్ ‘మేం ఆర్డర్ పాస్ చేయట్లేదు కానీ, సోమవారం వరకు అరెస్టు చేయొద్దని చెప్పండి’ అని సిఐడి తరపున న్యాయవాది రోహత్గీకి సూచించారు.
17ఏపై ఇంకా వాదనలు పూర్తి కానందున ఫైబర్ నెట్ కేసులో ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. విజయవాడ ఎసిబి కోర్టులో ఫైబర్ నెట్ కేసును బుధవారానికి వాయిదా వేయాలని, అప్పటి వరకు అరెస్టు చేయొద్దని సమాచారమిస్తామని సిఐడి తరపు న్యాయవాది రోహత్గీ కోర్టుకు తెలిపారు.