కారు బేకారు అయిపోయింది.. చేయి ప్రజలకు చెయ్యిచ్చిందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని విమర్శించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలివ్వనందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని రక్షణ మంత్రి భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన గర్జన బహిరంగ సభలో సోమవారం రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనుకబడిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, ప్రజలు కేసీఆర్ పాలనలో సంతృప్తిగా లేరని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములను మాయం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని దుయ్యబట్టారు.
కల్వకుంట్ల కుటుంబ అవినీతి ఢిల్లీవరకు చేరిందని ఎద్దేవా చేశారు. తెలంగాణా రాష్ట్రసాధన కోసం కేసీఆర్ ఒక్కడే ఉద్యమించలేదని, యావత్ తెలంగాణా ప్రజలు చేసిన ఉద్యమానికి బీజేపీ కూడా అండగా నిలిచిందని గుర్తు చేసారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు…బేకార్ అవుతుందని, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు హ్యండ్ ఇవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ ఫలాలకు రూపాయి కేటాయిస్తే ప్రజలకు ఇరవై పైసలే వచ్చాయని, కాంగ్రెస్ నాయకుల దోపిడిని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు.
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని, ఇక్కడి ప్రజలను చూస్తుంటే రాజకీయ చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని తెలిపారు. రాణీ రుద్రమ, కొమురంభీం లాంటి ఎందరో మహానుభావులు పుట్టినగడ్డ తెలంగాణ అని కొనియాడారు. 1984లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో గెలిస్తే ఒకటి గుజరాత్ నుంచి, రెండోది తెలంగాణ నుంచి గెలిచామని కేంద్రమంత్రి గుర్తు చేశారు.
గత 27 ఏళ్లుగా గుజరాత్ ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. కేవలం గుజరాత్ మాత్రమే కాకుండా దేశమంతా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణలో మాత్రం అభివృద్ధి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుడి ఉందని కేంద్రమంత్రి రాజ్నాథ్ భరోసా ఇచ్చారు.
2014లో ప్రజల పోరాటానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఒక లిమిటెడ్ కంపెనీలా, ఒక కుటుంబం అభివృద్ధికి మాత్రమే దోహదపడుతుందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారని మండిపడ్డారు రాజ్నాథ్.
ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునే పార్టీ బీజేపీ అని తెలిపారు. అయోధ్యలో రామమందిరం కడతామని చెప్పి కట్టామని, జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పి చేశామని గుర్తు చేశారు.దేశవ్యాప్తంగా భూ రికార్డులు డిజిటలైజ్ చేసి, పారదర్శకంగా సమాచారం అందించడమే కాకుండా రుణ సౌకర్యం పొందే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు రాజ్ నాథ్ పిలుపునిచ్చారు.