ట్రాన్స్జెండర్ల సమాజాన్ని ప్రత్యేక కులంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. బీహార్ ప్రభుత్వం కులగణన నివేదికలో ట్రాన్స్జెండర్లను ప్రత్యేక కులంగా కాకుండా ప్రత్యేక కేటగిరీగా చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం లోని సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
లింగమార్పిడి చేసుకున్న వారిని (ట్రాన్స్జెండర్లు) ప్రత్యేక కులంగా పరిగణించలేమని, ఎందుకంటే ట్రాన్స్జెండర్లు అన్ని కులాల్లోనూ ఉంటారని వివరించింది. బీహార్ ప్రభుత్వం వారికి , పురుష, స్త్రీ, కేటగిరీలతోపాటు టాన్స్జెండర్లకు మూడో కేటగిరీ (కాలమ్ ) కల్పించిందని, మూడో కాలమ్‌లో ట్రాన్స్‌జెండర్ జనాభా వివరాలు ఉంటాయని పేర్కొంది.
మూడో జెండర్‌గా వారు కొన్ని ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది. దేశం మొత్తం మీద కులగణన సర్వే చేపట్టిన మొదటి రాష్ట్రం బీహార్. ఈ కులగణన సర్వే నివేదిక ప్రకారం జనాభాలో 36 శాతం బాగా వెనుకబడిన తరగతులు, 27.1 శాతం వెనుకబడిన తరగతులు, 19.7 శాతం షెడ్యూల్డ్ కులాలు, 1.7 శాతం షెడ్యూల్డ్ తెగలు అని తేలింది. సాధారణ జనాభా 15.5 శాతం వరకు ఉన్నారని బయటపడింది. రాష్ట్రం మొత్తం జనాభా 13.1 కోట్లకు మించి ఉంది.