లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ తీసుకొన్న నిర్ణయం ఆ పార్టీలో సంక్షోభం సృష్టిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం పార్టీలో చీలిక సంకేతాలు ఇచ్చారు.
కొంత మంది పార్టీ నేతలతో ఆయన సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో కలిసి వెళ్లొద్దని పార్టీ సుప్రీం దేవెగౌడను కోరారు. సెక్యులర్‌గా ఉన్న తన వర్గమే అసలైన జేడీఎస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు.
‘వారు(దేవెగౌడ, కుమారస్వామి) బీజేపీతో వెళ్లాలనుకొంటే వెళ్లొచ్చు. తాము మాత్రం ఆ పని చేయలేం’ అని తేల్చి చెప్పారు. బీజేపీతో వెళ్లకూడదని తాము ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నామని చెబుతూ తనతో చాలా మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఇబ్రహీం వెల్లడించారు.
అయితే, తనతో వచ్చే ఎమ్యెల్యేల పేర్లు చెప్పేందుకు మాత్రం తిరస్కరించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో సమావేశం అవుతానని, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని చెప్పారు. బీజేపీతో పొత్తు ప్రకటన వల్ల కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో నేతలు పార్టీని వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఆ కమిటీ దేవెగౌడకు వివరిస్తుందని ఇబ్రహీం తెలిపారు.కాగా, ఇబ్రహీం ప్రకటనపై కుమారస్వామి స్పందిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్వతంత్రుడు అని, అతని నిర్ణయం కోసం తాము వేచి ఉంటామని పేర్కొన్నారు.
‘పార్టీ నేతలు, కార్యకర్తలు తీసుకొన్న నిర్ణయం ఒకటుంటుంది. ఆ నేపథ్యంలో అతను(ఇబ్రహీం) ఏర్పాటు చేసిన సమావేశంలో దానిపై తన మద్దతుదారులతో చర్చించారు. అతను తన నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది’ అని కుమారస్వామి పేర్కొనడం గమనార్హం.