రాష్ట్రపతి భవన్ లో మంగళవారం అత్యంత ఘనంగా జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విజేతలు హాజరు కాగా, జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ అవార్డుతో చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నా, ఇప్పటి వరకు ఎవరికీ ఆ అవకాశం దక్కలేదు. పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్నారు.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తో కలిసి హాజరయ్యారు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన, దర్శకుడు బుచ్చిబాబు సాన, నిర్మాతలు రవిశంకర్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ అవార్డులు స్వీకరించనున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను దర్శకుడు రాజమౌళి, ది కాశ్మీర్ ఫైల్స్ చిన్న సినిమాకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డులు తీసుకోనున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆరు పురస్కారాలు లభించాయి.
పుష్ప ది రైజ్ సినిమాకు రెండు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలువగా, కొండపొలం సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు చంద్రబోస్ కు ఉత్తమ గీత రచయితగా పురస్కారం లభించింది. ది కాశ్మీర్ ఫైల్స్ రెండు పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే ఉత్తమ నటిగా గంగుబాయి కటియావాడి సినిమాకు అలియాభట్, మిమి చిత్రానికి కృతి సనన్ అవార్డులు అందుకున్నారు.
తను నేషనల్ అవార్డు అందుకోవడం పై స్పందించిన అల్లు అర్జున్ నేషనల్ అవార్డును అందుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని కమర్షియల్ చిత్రం అయిన పుష్ప ది రైజ్ సినిమాకు జాతీయ అవార్డు రావడం డబుల్ అచీవ్మెంట్ అని తెలిపారు. పుష్ప చిత్రంలోని తగ్గేదేలే డైలాగ్ చెప్పి అందరినీ అలరించారు. ఇక అల్లు అర్జున్ మాట్లాడిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.