తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని కుంభకోణాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హస్తం ఉన్నదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళా సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ బడ్జెట్ మొట్టమొదట 40,000 కోట్లు అని చెప్పి తరవాత దానిని రూ. లక్ష కోట్లకు పెంచారని గుర్తు చేశారు.
మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసి తన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. తన స్వార్థం కోసం తెలంగాణ యువతను వంచించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని అందరం కలిసి కొట్లాడినం అని ఆమె తెలిపారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం నియామకాలు జరపడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు.
దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వారి ఎమ్మెల్యే లను హెచ్చరించారంటే వారి ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. వరంగల్ టెక్స్ట్ టైల్ పార్క్ ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం అది ఏర్పాటు చెయ్యటంలో విఫలమయ్యిందని అంటూ ఆమె తెలంగాణ ప్రభుత్వ వైపల్యాను ఎత్తి చూపారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు ఒక్కటే జట్టు అని, అది 2018 ఎన్నికల్లోనే తేలిందని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరు బిఆర్ఎస్ లో చేరటం రాష్ట్ర ప్రజలు చూశారని ఆమె గుర్తు చేశారు. సిద్ధిపేటకు రైలు తెచ్చింది, అదేవిదంగా రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ప్రారంభించి తెలంగాణాలో ఎరువుల కొరత లేకుండా చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు.
కోవిడ్-19 సమయంలో, ప్రధానమంత్రి అందరికి వాక్సిన్ ఫ్రీ గా అందించారని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎట్టి పరిస్ధితుల్లో కూడా అది సాధ్యం కాకపోయేదని కేంద్ర మంత్రి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏ ఒక్క రోజు ఆలోచన చేయలేదని ఆమె దయ్యబట్టారు. వడ్ల కొనుగోలుకు 2014-20 వరకు రూ. 27 వేల కోట్లు మోడీ ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆమె చెప్పారు.
2014 వరకు జాతీయ రహదారులు 2500 కి. మీ అయితే మోడీ వచ్చాక మరో 2500 కి. మీ నిర్మించారని ఆమె పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించి కెసిఆర్ కు బుద్ధి చెప్పాలని ఆమె దుబ్బాక ప్రజలకు పిలుపునిచ్చారు.