తమ యాపిల్ ఫోన్లలో హ్యాకింగ్ యత్నాలకు సంబంధించిన అలర్ట్‌లు వచ్చాయంటూ విపక్షనేతలు చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. విపక్ష నేతలను ఎవరో సరదాగా ఆటపట్టించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
దానిపై విపక్షాలు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు గోయల్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు.
`ప్రస్తుతం విపక్ష పార్టీలు బలహీనదశలో ఉన్నాయని భావిస్తున్నాను. అందుకే ఆ పార్టీల నేతలు ప్రతిదాంట్లో కుట్రకోణాన్ని చూస్తున్నారు. ఇది ఒక లోపం వల్ల జరిగి ఉండొచ్చని, 150 దేశాల్లోని ప్రజలకు ఈ సందేశం వచ్చిందని యాపిల్ సంస్థే స్వయంగా వెల్లడించింది. దీనిని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు చురుకుగా ఉన్నారని కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతాం’ అని వెల్లడించారు.
అలాగే విపక్ష నేతలు ఏదనుకుంటే అది చెప్పొచ్చని, అయితే వారి పరిస్థితి ఏంటో దేశం మొత్తానికి తెలుసని, గోయల్ ఎద్దేవా చేశారు. వారు ప్రస్తుతం అంతర్గత పోరులో చిక్కుకుపోయి ఉన్నారని విమర్శించారు. వారు ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు వారి బలహీనతలను సమీక్షించుకోవాలని చురకలు అంటించారు. ప్రస్తుత వ్యవహారంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు.
యాప్‌లకు పార్లమెంట్ కమిటీ సమన్లు?
దేశ వ్యాప్తంగా పలువురు విపక్ష నేతల ఐఫోన్లకు మంగళవారం హ్యాక్ అలర్ట్ మెసేజ్‌లు రావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తున్నారు ’ అంటూ ఆ సందేశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు భగ్గు మన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ హ్యాక్ అలర్ట్ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం తమ దర్యాప్తును వేగవంతం చేసింది. దీనిపై వివరణ కోరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఐటీ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం , రాబోయే సమావేశంలో ఈ హ్యాక్ అలర్ట్ అంశంపై చర్చించనుందని ఈ కమిటీ సెక్రటేరియట్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసిందని, దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిందని తెలిపాయి. ఈ వ్యవహారంపై యాపిల్ ప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని కమిటీ యోచిస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
