ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై నగరాలు టాప్ 5లో ఉన్నాయి. ఈమేరకు స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ నివేదికను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 483గా ఉంది.
దీంతో ఐక్యూ ఎయిర్ జాబితాలో ఢిల్లీ మొదటి ప్లేస్‌లో ఉంది. ఇక 371 పాయింట్లతో పాకిస్థాన్‌లోని లాహోర్ రెండో స్థానంలో ఉండగా, కోల్‌కతా (206), బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (189), పాకిస్థాన్‌లోని కరాచీ (162) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక 162 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో ఉండగా, చైనాలోని షెన్యాంగ్ (159), హాంగ్జౌ (159), కువైట్ సిటీ (155), చైనాలోని వుహాన్ (152) టాప్ టెన్‌లో నిలిచాయి.
తక్కువ ఉష్ణోగ్రతలు, గాలి సరిగా లేకపోవడంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పొలాల్లోని పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీలో గాలి కలుషితం అవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏక్యూఐ 550కి చేరుకోవడంతో 2 కోట్ల మంది ప్రజలు కంటి, గొంతు సమస్యలతో బాధపడుతున్నారు.
ఏక్యూఐ 0-50గా ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్లు భావిస్తారు. కానీ, ఢిల్లీలో ఏ సమయంలో చూసినప్పటికీ 400-500గా ఉండడంతో ఈ గాలిని పీల్లచడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ-రాజధాని ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు.
మరో ఐదు రోజులు స్కూల్స్ బంద్
కాగా, గాలి కాలుష్యంతో హస్తినలోని చాలాచోట్ల వాయు నాణ్యత సూచీ 450 పాయింట్లు దాటింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశ రాజధానిలో ప్రాథమిక పాఠశాలలకు మరో ఐదు రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇప్పటికే నేటివరకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం ఈ నెల 10 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఆరు నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని, అయితే విద్యార్థులు ఆన్‌క్లాసులు కూడా వినవచ్చని స్పష్టం చేసింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి అతిశి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఢిల్లీలో వరుసగా ఆరో రోజూ వాయు నాణ్యత 460 పాయింట్లు దాటింది. షాదీపూర్, వజీర్పూర్, ఓఖ్లా సహా పలుచోట్ల దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గాలి పీల్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. విషవాయుల గాఢత (పీఎం) 2.5 సాయిలో ఉన్నది. ఇది డబ్ల్యూహెచ్‌వో జారీచేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవడంతోపాటు కంటి దురద, శ్వాస కోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైదులు ఆందోళన వ్యక్తచేస్తున్నారు.
