* విరాట్ కోహ్లి రికార్డు 49వ సెంచరీ
=ఐసీసీ 2023 ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమ్ ఇండియా జైత్రయాత్ర తిరుగులేకుండా కొనసాగుతుంది. అగ్ర జట్టు, కఠిన ప్రత్యర్థి దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కాస్తో కూస్తో ఉత్కంఠ ఆశించిన తటస్థ అభిమానులకు నిరాశే ఎదురైంది. టీమ్ ఇండియా జైత్రయాత్ర ముంగిట దక్షిణాఫ్రికా తేలిపోయింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలగా, రవీంద్ర జడేజా (5/33) ఐదు వికెట్ల మాయజాలం ప్రదర్శించాడు.
విరాట్ కోహ్లి (101 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (77) మెరుపులతో తొలుత భారత్ 326 పరుగుల భారీ స్కోరు చేసింది. 243 పరుగుల తేడాతో సఫారీని చిత్తు చేసి గ్రూప్ దశలో వరుసగా ఎనిమిదో విజయం సాధించింది. ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
రవీంద్ర జడేజా (5/33) ఐదు వికెట్ల మ్యాజిక్కు మహ్మద్ షమి (2/18), కుల్దీప్ యాదవ్ (2/7) విజృంభించటంతో ఛేదనలో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే చేతులెత్తేసింది. టెయిలెండర్ మార్కో జాన్సెన్ (14, 30 బంతుల్లో 1 ఫోర్) సఫారీ శిబిరంలో టాప్ స్కోరర్. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి (101 నాటౌట్, 121 బంతుల్లో 10 ఫోర్లు) శతకంతో చెలరేగగా, శ్రేయస్ అయ్యర్ (77, 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిశాడు. సూర్యకుమార్ (22), రవీంద్ర జడేజా (29నాటౌట్, 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మెప్పించారు. కెరీర్ 49వ వన్డే సెంచరీ సాధించిన బర్త్‌డే బారు విరాట్ కోహ్లి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌లో నవంబర్ 12న బెంగళూర్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
ఈడెన్ పిచ్ నెమ్మదించింది. పరుగుల వేట గగనమైంది. రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉండనుంది. అయినా, టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (40, 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (23) ధనాధన ఆరంభాన్ని అందించారు. సఫారీ పేసర్లపై దండెత్తిన రోహిత్..ఆరో ఓవర్లోనే 60 పరుగుల మార్క్ దాటించాడు.
ప్రమాకరంగా మారుతున్న రోహిత్‌ను రబాడ వెనక్కి పంపగా.. కండ్లుచెదిరే మాయతో గిల్‌ను కేశవ్ మహరాజ్ సాగనంపాడు. దీంతో 93 పరుగులకు భారత్ ఓపెనర్లను కోల్పోయింది. ఈ స్థితిలో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ భారత్‌ను ముందుకు నడిపించారు.
మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించగా కోహ్లి 67 బంతులో అర్థ సెంచరీ అందుకోగా, అయ్యర్ 64 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. నెమ్మదించిన పిచ్‌పై పరుగుల వేట కస్టమైనా.. తొలుత అయ్యర్ దూకుడు పెంచగా, కోహ్లి సైతం అదే బాటలో నడిచాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి అయ్యర్ అవుట్ కాగా.. రాహుల్ (8) ఇబ్బంది పడ్డాడు.
సూర్య (22), జడేజా (29 నాటౌట్) చివర్లో కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సూర్య ఐదు బౌండరీలు బాదగా.. చివరి ఓవర్లో జడేజా విశ్వరూపం దాల్చాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో అజేయంగా 29 పరుగులు చేశాడు. 119 బంతుల్లో శతకం సాధించిన కోహ్లి.. 101 పరుగుల అజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో ఎంగిడి,రబాడ, జాన్సెన్, మహరాజ్, షంషి తలా ఓ వికెట్ పడగొట్టారు.
మంచు ప్రభావం అనుకూలతతో సఫారీ బ్యాటర్లు రెచ్చిపోతారని అనుకుంటే.. భారత బౌలర్లు కథ మార్చేశారు. సిరాజ్ తొలి ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న డికాక్ (5)ను అవుట్ చేయగా.. పవర్‌ప్లేలోనే బంతి అందుకున్న జడేజా.. సఫారీ కెప్టెన్ బవుమా (11) కథ ముగించాడు. కొత్త బంతితో జడేజా మాయజాలం ముంగిట సఫారీ బ్యాటర్లు తేలిపోయారు.
స్పిన్ బాగా ఆడగల క్లాసెన్ (1), డెవిడ్ మిల్లర్ (11) జడేజాకు దాసోహం అయ్యారు. వాండర్ డుసెన్ (13), మార్క్రామ్ (9)లను షమి సాగనంపాడు. దీంతో 59 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. మార్కో జాన్సెన్ (14) ఓటమి అంతరం కుదించే ప్రయత్నం చేశాడు. కుల్దీప్ యాదవ్ సైతం రెండు వికెట్లతో మెరువగా.. 27.1 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 83 పరుగులకు కుప్పకూలింది. 243 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.