మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముడుపుల వ్యవహారం ఛత్తీ్‌సగఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కీలక ప్రచారాస్త్రంగా మారింది. గల్ఫ్‌లో ఉన్న ఇద్దరు నిందితులు కేంద్రంగా కొనసాగుతున్న ఈ కేసు కాంగ్రె్‌సను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఛత్తీ్‌సగఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌కు ముడుపులు అందాయంటూ ఈడీ ఆరోపణలు చేస్తోంది. ఇదే అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వాడుకుంటోంది.
మహాదేవ్ యాప్ యజమానుల్లో ఒకడైన సౌరభ చంద్రకర్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకొని, తన బంధుమిత్రులను నాగ్‌పూర్ నుంచి యూఏఈలోని రాస్ అల్ ఖైమాకు తీసుకెళ్లాడు. ఈ ఘటనతో అతను అధికారుల దృష్టిలో పడ్డాడు. కొద్ది కాలం క్రితం ఛత్తీ్‌సగఢ్‌లో రోడ్డుపై చెరుకు రసం అమ్ముకున్న అతను ఏకంగా గల్ఫ్‌లో తన పెళ్లి పార్టీ కోసం రూ.250 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లుగా గుర్తించిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విస్తుపోయారు.
ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకొని ఆన్లైన్లో భారీ ఏజెంట్ల వ్యవస్థను ఏర్పరచుకొని, ఆన్లైన్ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్న విధానాన్ని బట్టబయలు చేశారు. అదే సమయంలో ఛత్తీ్‌సగఢ్ పోలీసులు కూడా ఈ యాప్‌పై విచారణ జరిపి, అనేక మందిని అరెస్టు చేశారు. తాజాగా, మహాదేవ్ బుక్ సహా 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది.
అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నందున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు మొత్తం 22 యాప్‌లు, వెబ్సైట్లను నిషేధించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిలో‘రెడ్డిఅన్నప్రెస్టోప్రొ’ అనే యాప్ కూడా ఉంది.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మహాదేవ్ బుక్ అక్రమ బెట్టింగ్ సిండికేట్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించగా.. అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడయ్యిందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది.
అయితే, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తనను యూఏఈకి వెళ్లాలని కోరినట్లు నిందితుడు పేర్కొన్న రోజునే ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం గమనార్హం. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు నమోదుచేసిన నిందితుడ శుభమ్ సోనీ.. దుబాయ్ నుంచి ఒక వీడియోను విడుదల చేసి.. అందులో అతను భూపేశ్ బఘేల్‌పై తీవ్రమైన ఆరోపణ చేశాడు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీఎంపై ఈడీ మనీల్యాండరింగ్, అక్రమ నిధుల వినియోగం వంటి ఆరోపణలు చేయడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చట్టవిరుద్ధమైన యాప్, వెబ్‌సైట్‌ను చాలా కాలం కిందటే మూసివేసి ఉండాల్సిందని, ఎందుకంటే దానికి ఆ అధికారం ఉందని కేంద్రం ఆరోపించింది.
‘ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సెక్షన్ 69A IT (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చట్టం ప్రకారం వెబ్సైట్/ యాప్‌ను నిషేధించేందుకు సిఫార్సు చేసే అధికారం ఉంది. అయితే, వారు అలా చేయలేదు.. ఏడాదిన్నరగా దర్యాప్తు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటువంటి అభ్యర్థన రాలేదు. వాస్తవానికి ఈడీ మొదటిసారి అభ్యర్థించడంతో చర్యలు తీసుకున్నాం.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఇలాంటి అభ్యర్థనల విషయం ఏదీ అడ్డుకోలేదు’ అని కేంద్రం సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
కాగా, శనివారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి భూపేశ్ బఘేల్‌కు రూ.500 కోట్ల అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించిన విషయం తెలిసిందే.
దీనికి ఛత్తీస్‌గఢ్ సీఎం కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దుబాయ్‌తో మీకున్న ఒప్పందం ఏంటని? ఇంతవరకూ ఎవరినీ ఎందుకు అరెస్టులు చేయలేదు? అసలు యాప్‌ని ఎందుకు నిషేధించలేదని ఆయన నిలదీశారు. దీంతో ఆ మర్నాడే కేంద్రం ఆగమేఘాలపై యాప్‌ను నిషేధించడం గమనార్హం.