దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీ సర్కారు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తాజాగా ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్‌బుద్ధానగర్, ఘజియాబాద్‌లోనూ అధికారులను పాఠశాలలను మూసివేశారు. కాలుష్యం కారణంగా పాఠశాలలకు మూడురోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 8 నుంచి 10 వరకు పాఠశాలలకు సెలవులు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, తొమ్మిదో తరగతి విద్యార్థులకు సెలవులు ఇచ్చినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలను ఈ నెల 10 వరకు మూసివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాలుష్యం నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
అయితే, 6-12 విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతున్నది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి పొగమంచు కురుస్తున్నది. గురువారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నది. ఢిల్లీ నగరంతో పాటు గ్రేటర్ నోయిడా, ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత పడిపోయింది. ఈ నేపథ్యంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలులోకి వచ్చింది.
కాగా, దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణంగా ఉన్న పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపాలని ఢిల్లీ పొరుగు రాష్ర్టాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సుధాంశ్ ధులియా ధర్మాసనం ఆదేశించింది. ‘వెంటనే ఇది ఆగాలి. అందుకు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. పంట వ్యర్థాల దహనాన్ని ఆపడం మీ విధి’ అని పేర్కొన్నది.
కాలుష్యంపై ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. అన్ని సమయాల్లో రాజకీయ యుద్ధం ఉండకూదని సూచించింది. ‘ఈ పంట వ్యర్థాల దహనం ఆగడం లేదు. దీన్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకొన్నాయి’ అని ప్రశ్నించింది. కాలుష్యం కారణంగా ప్రజలు చనిపోనివ్వకూడదని అభిప్రాయపడింది.
ఏండ్లుగా కాలుష్య సమస్య ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు పరిష్కారాన్ని గుర్తించలేదని ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు పలు కీలకమైన సూచనలు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో ఘన వ్యర్ధాలను బహిరంగంగా తగులబెట్టడాన్ని నియంత్రించాలని సూచించింది.