రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో బిజెపి నిర్వహించిన `బిసి ఆత్మగౌరవ సభ’లో ప్రసంగిస్తూ తెలంగాణాలో బీజేపీ గెలుపొందితే తొలి బిసి ముఖ్యమంత్రిని చేస్తామని భరోసా ఇచ్చినా ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజులలోనే ఈ నెల 11న హైదరాబాద్ లోనే మరో భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బీజేపీ మరో బహిరంగ సభ నిర్వహించనుంది.ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు పీఎంవో అధికారులు. తెలంగాణ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ప్రధాని ప్రసంగించే రెండు బహిరంగసభలు కూడా ఒకే వారంలో హైదరాబాద్ లోనే జరుగుతూ ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్, పరిసర నియోజకవర్గాలపై బిజెపి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు ఆయన మహబూబ్ నగర్, నిజామాబాద్ లలో జరిగిన బహిరంగసభలలో ప్రసంగించారు. నవంబర్ 11న పరేడ్ గ్రౌండ్స్ లో “మాదిగ విశ్వరూప సభ” నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సభకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు కూడా రానున్నట్లు సమాచారం.
ఇక ఇదే సభలో ప్రధాని ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చాలాకాలంగా ఎస్సి వర్గీకరణకు బిజెపి మద్దతు తెలుపుతూ వస్తున్నది. ఈనెల 11న సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్ మార్గాన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు.
ప్రధాని ఈ సభలో దాదాపు 45 నిమిషాల పాటు సభలో పాల్గొంటారు. అనంతరం 6 గంటలకు అయన బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేస్తారు. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం జన సమీకరణ పై దృష్టి సారించింది. కాగా ఎప్పటినుండో ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్న ఎస్సీలకు నవంబర్ 11న శుభవార్త చెప్తారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ మోదీ తొలి పర్యటనకు ముందే ఎస్సీలు రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే “మాదిగ విశ్వరూప సభ” లో మోదీ ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.