గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం ఎస్సీలు చేస్తున్న పోరాటాన్ని తాము గుర్తించామని చెబుతూ మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’ లో శనివారం పాల్గొంటూ మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం హామీ ఇవ్వగలదని చెబుతూ తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసే సత్తా బీజేపీకే ఉందని భరోసా వ్యక్తం చేశారు. మీ న్యాయపరమైన పోరాటంలో తాను తోడుగా ఉంటానని మోదీ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగను తన చిన్న తమ్ముడిగా ఆయన అభివర్ణించారు.
స్వాతంత్ర్యం తర్వాత దేశంలో చాలా ప్రభుత్వాల్ని చూశామని, తమ ప్రభుత్వ ప్రాధాన్యత మాత్రం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే నినాదంతో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. గుర్రం జాషువాను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని చెప్పారు.
30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ ఒకే లక్ష్యంతో అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేస్తున్నారని, ఇప్పుడు ఆయనకు తాను కూడా తోడయినట్లు ప్రధాని మోదీ తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ఎన్నో పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చాయని, తప్పాయని కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చానని తెలిపారు.
గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దళితులకు ఇచ్చిన హామీలన్నీ ఎలా విస్మరించాయో ప్రధాని మోదీ వివరించారు. తెలంగాణ రాకముందు దళితుడిని సీఎం చేస్తానన్న బీఆర్ఎస్, మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చాక దళిత బంధు పేరుతో కూడా వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆయన కుటుంబానికి మాత్రం కావాల్సిన మేలు చేసుకున్నారని మండిపడ్డారు.
గతంలో బీఆర్ అంబేద్కర్ ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ప్రధాని మోదీ విమర్శించారు. దళిత ద్రోహి అయి బీఆర్ఎస్ తో ఎంత జాగ్రత్తగా ఉండాలో కాంగ్రెస్ తోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. అంబేద్కర్ రెండు సార్లు ఎన్నికలలో పోటీ చేస్తే ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.
కాంగ్రెస్ దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా పార్లమెంటులో ఆయన విగ్రహం పెట్టనివ్వలేదని ప్రధాని విమర్శించారు. బీజేపీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన విగ్రహం పెట్టడంతో పాటు ఆయనకు భారతరత్న ఇచ్చామని గుర్తు చేశారు. బీజేపీ రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్ర పతి అభ్యర్ధిగా నిలబెడితే కాంగ్రెస్ ఆయన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిందని ప్రధాని చెప్పారు.
కోవింద్ రాష్ట్రపతి అయ్యాక ఆయన దేశం మొత్తానికి, మనందరికీ రాష్ట్రపతిగా ఉన్నారని, అయినా కాంగ్రెస్ ఆయన్ను తిరస్కరించిందని పేర్కొన్నారు. దేశంలో తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మును నిలబెడితే ఆమెను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. రాజస్తాన్ లో పుట్టిన తెలంగాణను కర్మభూమిగా మార్చుకున్న హీరాలాల్ సామరియాను ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా తాము నియమించామని తెలిపారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి బీఆర్ఎస్ లిక్కర్ స్కాంలో అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరిస్తోందని ప్రధాని ధ్వజయంత్తారు. తెలంగాణలో ఇరుపార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెబుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని, పరస్పరం తెరవెనుక సహకరించుకుంటున్నాయని మోదీ ఆరోపించారు.
ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని ప్రధాని స్పష్టం చేశారు. పేదల కోసం కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, ఇందులో ఎస్సీ, ఓబీసీలకు ఎంతో మేలు జరుగుతోందని భరోసా ఇచ్చారు. మీరు నన్ను ప్రధానిగానే గుర్తిస్తారని, కానీ తాను గతంలో బంగారు లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీలో పనిచేశానని మోదీ గుర్తుచేశారు.