చత్తీస్ఘఢ్లో కాంగ్రెస్ నిష్క్రమణకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తొలి దశ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతం ఖాయమైందని ఆయన వెల్లడించారు. నవంబర్ 17న మలి దశ పోలింగ్‌కు ముందు సోమవారం ముంగేలిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.
కాంగ్రెస్ దౌర్భాగ్య పాలనకు చత్తీస్ఘఢ్ ప్రజలు చరమగీతం పాడనున్నారని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఐదేండ్ల పాటు మిమ్మల్ని దోచుకున్న కాంగ్రెస్ పాలకులను సాగనంపే సమయం ఆసన్నమైందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇక ఎంతమాత్రం కోరుకోవడం లేదని ప్రధాని తెలిపారు.
చత్తీస్ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాష్ట్రంలో అవినీతి పాలనతో కోట్లు దండుకున్నారని మోదీ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తే అవినీతి నేతలపై చర్యలు చేపడుతుందని ప్రధాని వెల్లడించారు. చత్తీస్ఘఢ్ సీఎం తన నియోజకవర్గంలో ఓడిపోతారని మీడియా మిత్రులు తనకు చెప్పారని వివరించారు.
అబద్ధపు వాగ్ధానాలతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తోందని, ఇప్పటివరకూ వారికి ఇచ్చిన హామీల్ని ఆ పార్టీ నెరవేర్చలేదని ఆరోపణలు చేశారు. చత్తీస్‌గఢ్‌లో తమ సమయం ముగిసిందన్న విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనని ఎంతో ద్వేషిస్తుందని, మొత్తం ఓబీసీ వర్గాన్ని ఆ పార్టీ దూషిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘కాంగ్రెస్ పార్టీ మోదీని ద్వేషిస్తోంది. ఇప్పుడు వాళ్లు మోదీ కమ్యునిటీని కూడా ద్వేషించడం ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా మోదీ పేరుతో మొత్తం ఓబీసీ వర్గాన్ని కాంగ్రెస్ దూషిస్తోంది. అలా చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసినా, వాళ్లు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. ఓబీసీ కమ్యూనిటీ పట్ల వారికి ఎంత ద్వేషం ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’’ అని మోదీ ధ్వజమెత్తారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో కాంగ్రెస్ నేతలకు సంబంధం ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. మహదేవ్ యాప్ స్కామ్‌లో రూ. 508 కోట్ల అవినీతి జరిగిందని, ఈ కేసులో పెద్దమొత్తంలో నగదును దర్యాప్తు సంస్ధలు స్వాధీనం చేసుకున్నాయని మోదీ చెప్పారు.
చత్తీస్ఘఢ్ సీఎంకు అత్యంత సన్నిహితుడు ఈ కేసులో జైలులో ఉన్నారని గుర్తుచేశారు. ఈ స్కామ్‌లో సీఎంకు ఎంత డబ్బు ముట్టింది, పార్టీ నేతలు ఎంత తీసుకున్నారు, ఢిల్లీకి ఎంత డబ్బు చేరిందనే వివరాలను కాంగ్రెస్ వెల్లడించాలని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు.