ఇటీవల జరిగిన చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఘోరంగా ఓటమి చెందినప్పటికీ, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేని ఇరకాట పరిస్థితిని ఎదుర్కోవడంతో బిజెపి అనూహ్యంగా మేయర్ పదవిని గెల్చుకొంది.
మొదటిసారిగా 36 వార్డ్ లలో 14 వార్డ్ లను గెల్చుకొని, ఏకైక అతిపెద్ద పక్షంగా అవతరించిన ఆప్ కు పంజాబ్ ఎన్నికల ముందు మేయర్ పదవి గెలుచుకోవాలనే ప్రయత్నం ఫలించలేదు. గత కార్పొరేషన్ లో గల 26 స్థానాలు ఈ సారి 12కు పడిపోయినప్పటికీ బిజెపి అభ్యర్థి సరబ్జిత్ కౌర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అంజు కత్యాల్పై కేవలం ఒక ఓట్ తేడాతో మేయర్ గా గెలుపొందారు.
వాస్తవానికి బిజెపి, ఆప్ అభ్యర్థులకు సమానంగా 14 చొప్పున ఓట్లు వచ్చాయి. అయితే ఆప్ కు వేసిన ఒక ఓట్ చెల్లదని ప్రకటించడంతో బిజెపి అభ్యర్థి గెలుపొందింది. దానితో అక్రమం జరిగినదని అంటూ ఆప్ సభ్యులు ఎన్నికలు జరిగిన అసెంబ్లీ హాలులో రసభ సృష్టించారు. ఇద్దరు డిప్యూటీ మేయర్ లకు జరుగవలసిన ఎన్నికలను జరగనీయకుండా అడ్డుకున్నారు.
ఏడుగురు సభ్యులు గల కాంగ్రెస్ పంజాబ్ ఎన్నికలలో తమకు ప్రధాన ప్రత్యర్హ్దిగా భావిస్తున్న ఆప్ మేయర్ అభ్యర్ధికి మద్దతు ఇస్తే తమ రెండు పార్టీల మధ్య లోపాయికారి సంబంధం ఉన్నదనే సంకేతం ప్రజలకు వెడుతుందని భయపడింది. మరోవంక జాతీయ స్థాయిలో తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బిజెపికి నేరుగా మద్దతు ఇవ్వలేక పోయారు. దానితో ఎన్నికకు దూరంగా ఉన్నారు.
వచ్చే నెలలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతుండడం, అక్కడ కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఆప్ కనిపిస్తూ ఉండడంతో, ఇప్పుడు ఆప్ అభ్యర్ధికి ఓట్ వేస్తే పంజాబ్ ఓటర్లకు తప్పుడు సంకేతం పంపినట్లు కాగలదని కాంగ్రెస్ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంది. దానితో ఆప్ కు ఇబ్బందులు ఎదురయ్యాయ్రి.
బిజెపికి అనుకూలంగా 13 మంది కౌన్సిలర్లు ఓటు వేయగా, ఎక్స్ అఫీషియో సభ్యుడు అయిన పార్లమెంటు సభ్యుడు కిరణ్ ఖేర్ నుండి మరో ఓటు వచ్చింది. మేయర్ ఎన్నికల్లో ఎంపీ ఓటు వేయలేరని ఆప్ కౌన్సిలర్లు వాదించినప్పటికీ, సెక్రటరీ వారికి చట్టం కాపీని అందించారు. అందులో ఒక ఎంపీ ఎక్స్-అఫిషియో సభ్యుడిగా ఉన్నట్లయితే, అతను లేదా ఆమె సభలో ఓటు వేయవచ్చని స్పష్టంగా ఉంది.