మాజీ ఐఎఏస్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లోని ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్, టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు.
2010లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన కొంతకాలం రాష్త్ర ప్రభుత్వ సలహాదారునిగా పనిచేశారు. ఆయన ఇంట్లో అధికార ఆపార్టీ నేతలు భారీగా నగదు ఉంచారని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ సోదాలు జరిపారు.
ఈ క్రమంలో ఏకే గోయల్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో.. ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇన్ని రోజులు కేవలం రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఇళ్లలోనే తనిఖీలు జరగ్గా ఇప్పుడు ఓ మాజీ ఐఏఎస్ అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారునిగా ఉన్న అధికారి ఇంట్లో జరగటం హాట్ టాపిక్ అయ్యింది. సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.