న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్‌ను తీసుకురావాల్సిన అవసరముందని ఆమె సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
‘ రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత అద్వితీయమైనది. బెంచ్ అండ్ బార్లో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తే సరైన న్యాయం అందించడం సాధ్యమవుతుంది.ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్‌ను ఏర్పాటు చేయడం మరింత మెరుగైన న్యాయాన్ని అందించడానికి తోడ్పడుతుంది’ అని ఆమె చెప్పారు.
అంతేకాకుండా దీన్ని ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించవచ్చని రాష్త్రపతి చెప్పారు. ప్రతిభావంతమైన యువతను దీనికి ఎంపిక చేసి న్యాయమూర్తులుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొంటూ ఇది కింది స్థాయినుంచి ఉన్నతస్థాయి వరకు వారి ప్రతిభను పెంపొందించగలదని ఆమె తెలిపారు.
దేశంలో న్యాయ సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమానికి సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, కేంద్ర న్యాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు. సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ పౌరులు కోర్టులను ఆశ్రయించడానికి భయపడవద్ని స్పష్టం చేశారు. గత ఏడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టు ప్రజాకోర్టుగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.
అక్రమ అరెస్టుల్లో జవాబుదారీ తనం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ,నిర్బంధ కార్మికుల హక్కులు, సామాజిక రుగ్మతల నిర్మూలన, గిరిజన భూముల రక్షణ… ఇలా వివిధ అంశాల కోసం సామాన్య పౌరులు కోర్టును ఆశ్రయించారని చంద్రచూడ్ వివరించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగం నిరంతరం మార్పులకు లోనవుతుందని, రాజ్యాంగ విలువలపై చర్చ కేవలం కోర్టు కేసులకు పరిమితం కాదని, వివిధ రంగాల్లోనూ ప్రభావం చూపుతుందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు.