హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో ఖేల్ ఖతమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని సోమవారం కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో, హైదరాబాద్ లో జరిగిన రోడ్ షోలో స్పష్టం ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని, బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతున్నారని ప్రధాని వెల్లడించాయిరు. పదేళ్ల బాలుడి భవిష్యత్ కోసం అతడి తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారన్న మోదీ పదేళ్ల వయసున్న తెలంగాణకు వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ మార్పు తథ్యమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 30న తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారని ప్రధాని మోదీ తెలిపారు. కేసీఆర్ పని అయిపోయిందన్న మోదీ…తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని జోస్యం చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెబుతూ బీజేపీ ప్రభుత్వంలో బీసీ వ్యక్తి సీఎం అవుతారని స్పష్టం చేశారు. దేశం కోసమే ఓటు వేయాలంటే బీజేపీకి మాత్రమే ఓటేయాలని మోదీ కోరారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందని ప్రధాని మోదీ ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీఆర్ఎస్ చేరుతుందని ప్రజలు గుర్తించాలని ప్రధాని హెచ్చరించారు. కేసీఆర్‌ను వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పిల్లల భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీని చేస్తామంటే కేసీఆర్ అడ్డుపడ్డారని మోదీ ఆరోపించారు.
కరీంనగర్ ను లండన్ చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ప్రధాని మోదీ ప్రశ్నించారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కుటుంబ పార్టీలు వారి పిల్లల భవిష్యత్ గురించే ఆలోచిస్తారు కానీ, ప్రజల పిల్లల గురించి ఆలోచించరని విమర్శించారు.