కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘంమండిపడింది. ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రంలో ప్రకటనలు జారీ చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలంటూ కర్ణాటక సీఎస్‌కు లేఖ రాసింది. వెంటనే ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశించింది.
ప్రకటనల జారీపై సంబంధిత సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యదర్శిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని లేఖలో పేర్కొంది. ఎన్నికల వేళ తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ పై విధంగా స్పందించింది. ప్రకటనల కోసం కర్ణాటక ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదని ఈసీ వెల్లడించింది.
ప్రకటన కోసం కర్ణాటక ప్రభుత్వం కనీసం దరఖాస్తు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇంగ్లీష్, స్థానిక మీడియా సంస్థలకు కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పార్టీ నేతలు సుధాన్షు త్రివేది, ఓం పాఠక్‌లతో కూడిన బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిథ్య చట్టం, ఎన్నికల నియమావళిని కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించిందని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం గత కొన్ని రోజులుగా తెలంగాణకు చెందిన ఇంగ్లీష్, ప్రాంతీయ మాధ్యమాల్లో ప్రకటనలు ప్రచురిస్తోందని అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య, సంబంధిత ప్రభుత్వంలోని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మరో రాష్ట్రంలో ఎన్నికలను ప్రభావం చేసేందుకు ప్రజాధనాన్ని వినియోగిస్తోందని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఇలాంటి అంశాలపై స్పష్టమైన సందేశం ఇచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.