ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో 5 శాతం సీట్లు కేటాయిస్తూ అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో 5 శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేటాయించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో రాష్ట్ర సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం అందులో ఒకటని తెలిపారు.
అయితే, ఆ విద్యార్థులు కనీసం 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో అస్సాం స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ సిలబస్ ను చదివి ఉండాలి. అలాగే, 11వ తరగతి, 12వ తరగతిలను అస్సాం హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సిలబస్ ను ప్రభుత్వ కళాశాలల్లో చదవి ఉండాలి. ఈ రిజర్వేషన్లను అదనంగా కల్పిస్తున్నవి కావని అస్సాం ప్రభుత్వం స్పష్టం చేసింది.
షెడ్యూల్డ్ కులాలు (ఎస్సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసి), మైనారిటీలు, ఇతర వెనుకబడిన తరగతులు (ఎంఓబిసి), ఆర్థికంగా బలహీనమైన విభాగం (ఈడబ్ల్యుఎస్), జనరల్ కేటగిరీల్లోనే అంతర్గతంగా ఈ రిజర్వేషన్లను కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. విద్యార్థుల కొరత లేదా రిజల్ట్స్ సరిగ్గా రాకపోవడం వంటి కారణాల వల్ల ఇటీవల చాలా ప్రభుత్వ పాఠశాలలను మూసేయాల్సి వచ్చింది.