కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి అలియాస్ సుఖ్ దేవ్ సింగ్ ను రాజస్థాన్ లోని జైపూర్‌లో కాల్చి చంపేశారు. మంగళవారం స్కూటర్ పై వెళ్లిన కొందరు దుండగులు సుఖ్ దేవ్ సింగ్ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపి పరారయ్యారు.
తీవ్రగాయాలైన సుఖ్‌దేవ్‌ను మానససరోవర్లోని మెట్రో మాస్ ఆసుపత్రికి తరలించారు, అక్కడి వైద్యులు సుఖ్ దేవ్ సింగ్ కు చికిత్స చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
కొన్ని ప్రాథమిక ఆధారాల ప్రకారం సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని జైపూర్‌లోని శ్యామ్ నగర్‌లోని దానా పానీ రెస్టారెంట్ వెనుక వైపు ఉన్న ప్రాంతంలోని ఇంటిలో కాల్చి చంపేశారని వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఘటనపై జైపూర్ పోలీసులు విచారణ ప్రారంభించి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ పరిశీలిస్తున్నారు.
సీసీటీవీ పుటేజీల పరిశీలించి హత్య జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. 2018లో బాలీవుడ్ చిత్రం పద్మావత్ విడుదల సందర్భంగా కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కర్ణి సేన ఆ సినిమాను బ్యాన్ చెయ్యాలని ఆందోళనలకు దిగారు.
కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ పై దాడి జరిగిన సమయంలో మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రా నుంచి సుఖ్‌దేవ్ సింగ్‌ను చంపేస్తామని ఫోన్ లు చేసి బెదిరించారు. దీనిపై సుఖ్ దేవ్ సింగ్ జైపూర్ పోలీసులకు కూడా సమాచారం అందించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో సుఖ్ దేవ్ సింగ్ ఆయన ఇంటి బయట నిలబడి ఉండగా స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. సుఖ్ దేవ్ సింగ్ మీద కాల్పులు జరిపిన వెంటనే నిందితులు వచ్చిన స్కూటర్ మీదనే అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ తో పాటు ఉన్న అజిత్ సింగ్ అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, హంతకుల కోసం గాలిస్తు్నామని పోలీసులు అధికారులు తెలిపారు.
