ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం పునః నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయం ప్రారంభోత్సవ వేడుక జరుగనున్నది. ఈ క్రమంలో ఆలయ గర్భగుడి ఫోటోలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ విడుదల చేశారు.
సోషల్ మీడియా సైట్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా విడుదల చేయగా.. వైరల్ అయ్యాయి. శ్రీరామచంద్రమూర్తి ఆలయ మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయ గర్భగుడి సైతం దాదాపు సిద్ధమైందని, ఇటీవల లైటింగ్ పనులు సైతం పూర్తయినట్లు చంపత్రాయ్ పేర్కొన్నారు.
మరో వైపు జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభంకానున్నది. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ప్రధాని నరేంద్ర మోడీ సహా 130 దేశాల ప్రతినిధులు హాజరవనున్నారు.
ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై రోజూ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది.
తాజాగా- అయోధ్య సూర్యస్తంభాన్ని నిర్మించారు. అయోధ్యలోని ధర్మపథ్ మార్గంలో దీన్ని నెలకొల్పారు. దీని ఎత్తు సుమారు 20 అడుగులు. పైభాగంలో సూర్యుడి ప్రతిబింబాన్ని అమర్చారు. స్తంభంపై జై శ్రీరామ్ అనే అక్షరాలను హిందీలో ముద్రించారు. హనుమంతుడు, గద, ఇతర రామాయణ ఘట్టాలను దీనిపై చిత్రీకరించారు.
సూర్యస్తంభం ఏర్పాటు పనులను అయోధ్య జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ధర్మపథ్ ప్రారంభ పాయింట్లో సూర్యస్తంభాన్ని నెలకొల్పామని, ఇక ముగింపు పాయింట్లో త్వరలోనే దీన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. అయోధ్యలో ఇదొక చారిత్రక ఘట్టంగా మారుతుందని వ్యాఖ్యానించారు.